“తమ్ముడి కళ్లెదుటే ప్రియుడి దారుణం..!” నడిరోడ్డుపై కొట్టుమిట్టాడిన యువతి.. ప్రేక్షకపాత్ర వహించిన జనం: చచ్చిపోయిన మానవత్వం..

గుజరాత్ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో, పట్టపగలే కాజల్ పరైయా అనే యువతిని ఆమెతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉంటున్న ఫైసల్ ఖాన్ అనే ప్రియుడు అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.

బస్టాండ్‌లో కాజల్ తన తమ్ముడితో కలిసి ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ఫైసల్, ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. ఫైసల్ కాజల్ ముఖంపై కాళ్లతో తన్నుతూ, మెడపై కాలు పెట్టి తొక్కుతూ, తలపై బలంగా తన్నుతూ కర్కశంగా దాడి చేయడం రికార్డైంది. కాజల్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిని కూడా వదలకుండా చితకబాదాడు. ఈ పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన కాజల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశంలో ఇంతటి ఘోరం జరుగుతున్నప్పటికీ, అక్కడున్న ప్రయాణికులు గానీ, స్థానికులు గానీ ఆమెను కాపాడేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అంతా ప్రేక్షకపాత్ర వహిస్తూ చూస్తూ ఉండిపోయిన తీరు, సమాజంలో చచ్చిపోతున్న మానవత్వాన్ని చాటిచెప్పడంతో పాటు తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గుజరాత్ పోలీసులు, నిందితుడు ఫైసల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడి మెడ, చేతులకు తాళ్లు కట్టి భావ్‌నగర్ బస్టాండ్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో కస్టడీలో ఉన్న ఫైసల్‌ను పోలీసులు లాఠీలతో కొడుతూ విచారించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

కాజల్ హత్య, ఆమె సోదరుడిపై దాడి ఘటనపై గుజరాత్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు నలుగురి ముందే జరిగిన ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా పెను దుమారం రేపగా, కాజల్ కుటుంబానికి కఠిన న్యాయం జరగాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


Posted

in

by

Tags: