తమ్ముడిలా నటిస్తూ పెళ్లి చేయించిన వ్యక్తి, నవ వధువుకు అసలు భర్త! నగలు, డబ్బుతో పారిపోయే ప్లాన్ విఫలం.

పెళ్లి పేరుతో మోసాలు జరగడం మీరు వినే ఉంటారు, కానీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటన పోలీసులనే నివ్వెరపరిచింది. ఒక పేద అమ్మాయికి పెళ్లి చేస్తున్నానంటూ ఆడంబరంగా కన్యాదానం చేసిన వ్యక్తి, తీరా చూస్తే ఆ పెళ్లికూతురి అసలు భర్త అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు.

ఈ ఘటన గ్వాలియర్‌లోని నాకా చంద్రవదని ప్రాంతంలో జరిగింది. బాధిత యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రాధా అలియాస్ దీక్ష ముద్గల్, ఆమె తమ్ముడిగా నటించిన వ్యక్తి మరియు మరో 7 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐదుగురు అన్నదమ్ముల పరిస్థితిని ఆసరా చేసుకుని… 35 ఏళ్ల రతన్ శర్మ గ్వాలియర్ వాసి, ప్రస్తుతం జబల్‌పూర్‌లో పని చేస్తున్నారు. ఐదుగురు అన్నదమ్ములకు పెళ్లిళ్లు కాకపోవడంతో వారు మంచి సంబంధం కోసం చూస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పొరుగువాడు సోనూ తివారీ, ఒక పక్కా ప్రణాళికతో ఈ మోసానికి తెరలేపాడు. తన స్నేహితుడు అజయ్ చౌహాన్‌కు చెందిన ‘పేద సోదరి’ అంటూ రాధా ఫోటోను చూపించి రతన్ శర్మ కుటుంబాన్ని నమ్మించాడు.

7 లక్షల ఖర్చుతో ఘనంగా వివాహం: ఏప్రిల్ 27న అజయ్ చౌహాన్ తాను అమ్మాయి తమ్ముడినని చెప్పుకుంటూ రతన్ ఇంటికి వచ్చాడు. మే 7న ఒక లగ్జరీ హోటల్‌లో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం రతన్ కుటుంబం సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేసింది. అక్కడికి వచ్చిన పెళ్లికూతురి తల్లి, తోబుట్టువులు అందరూ ఆ ముఠా సభ్యులే కావడం గమనార్హం.

వాట్సాప్ చాట్‌తో బయటపడ్డ అసలు నిజం: పెళ్లి తర్వాత రతన్ భార్య రాధా, రాత్రిపూట ఎవరితోనో ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ఉండటాన్ని గమనించిన రతన్‌కు అనుమానం వచ్చింది. ఒకరోజు ఆమె ఫోన్ చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. పెళ్లిలో ‘తమ్ముడిగా’ నటించిన అజయ్ చౌహాన్, ఆమెకు అసలైన భర్త అని, 2024లో వారు ఆగ్రాలోని ఆర్యసమాజ్ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారని చాటింగ్ ద్వారా వెల్లడైంది.

నగలు, డబ్బు దోచుకునే ప్లాన్: ఇదంతా కేవలం నగలు, డబ్బు దోచుకుని పారిపోవడానికి వేసిన ప్లాన్ అని అర్థం చేసుకున్న రతన్, అప్రమత్తమై రాధాను ఇంట్లోనే బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ముఠా గతంలో కూడా ఇలాగే అనేక మంది యువకులను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


Posted

in

by

Tags: