తల్లిగా మారిన అత్తగారు..! “కొడుకు చనిపోయిన నెల రోజులకే కోడలికి మరో పెళ్లి”.. తమ్ముడి స్థానంలో నిలబడి కన్యాదానం చేసిన మరిది..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో భర్తను కోల్పోయిన ఓ మహిళకు ఆమె అత్తగారు పునర్వివాహం జరిపించిన ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సుమారు నెల రోజుల క్రితం భర్త మృతి చెందగా, కోడలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాహంలో ఆ మహిళ మరిది సొంత తమ్ముడి స్థానంలో ఉండి ఆమెకు కన్యాదానం చేశాడు. ఈ హృద్యమైన ఘటన ఆ ప్రాంతంలో ఎందరో మనసులను గెలుచుకుంది.

ముజఫర్‌నగర్‌కు చెందిన మీనాక్షికి 2017లో రోహిత్‌తో వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గత ఆగస్టు 14న రోహిత్ తండ్రి ఓంపాల్ మృతి చెందగా, ఆ మరుసటి రోజే ఆ షాక్‌తో రోహిత్ కూడా ప్రాణాలు విడిచినట్లు సమాచారం. దీంతో భర్తను కోల్పోయిన మీనాక్షి తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.

దీంతో, మీనాక్షి అత్తగారు సునీత తన కోడలికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మీనాక్షి అంగీకారంతో, రాజస్థాన్‌లో చాట్ బండి నడుపుకునే యోగేష్ అనే వ్యక్తితో ఆర్య సమాజ్ ఆలయంలో వివాహం జరిపించారు. ఈ పెళ్లిలో మీనాక్షి మరిది మోహిత్ సొంత సోదరుడిలా నిలబడి కన్యాదానం చేశాడు. వివాహం తర్వాత కూడా మీనాక్షిని సొంత కూతురిలాగే భావించి, ఈ బంధాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని ఆమె అత్తగారు, మరిది తెలిపారు.

ఈ వివాహం తన ఇష్టప్రకారమే జరిగిందని మీనాక్షి వెల్లడించారు. పెళ్లి విషయంలో తనను ఎవరూ బలవంతం చేయలేదని, తనకు మంచి జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతోనే తన అత్తారింటి వారు ఈ ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. “మా నాన్న, అన్నయ్య ఇద్దరూ లేరు; వదినకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఆమెతో పాటు పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మరిది మోహిత్ పేర్కొన్నాడు. కోడలిని సొంత కూతురిలా భావించి పెళ్లి చేసి సాగనంపిన ఆ అత్తగారి గొప్ప మనసుపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *