తల్లిదండ్రుల్లో ఎవరు ఎక్కువ త్యాగం చేశారు? ఒక కుమారుడి ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం..

ఒక కుమారుడు ఒకసారి తన తల్లిని అడిగాడు: “మమ్మల్ని పెంచడం కోసం మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కష్టపడి త్యాగం చేశారు.. మీరా లేక నాన్ననా..?”

అందుకు తల్లి ఇలా సమాధానమిచ్చింది: “ఈ ప్రశ్న నువ్వు నన్ను అడిగి ఉండకూడదు. పిల్లలను పెంచడంలో ఒక తల్లికి కానీ, తండ్రికి కానీ ఎలాంటి కష్టం ఉండదు. అయినప్పటికీ చెబుతున్నాను విను. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు తన సొంత ఇష్టాలకు, అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ నువ్వు పుట్టిన తర్వాత తన ఇష్టాఇష్టాలను మార్చుకుని.. మీ కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆహారం, బట్టలు, మందులు మరియు మీ చదువు వంటి అనేక అవసరాల కోసం ఎంతో కష్టపడి సంపాదించారు. నువ్వు, నేను మరియు ఈ కుటుంబం అంతా మీ నాన్న చెమట చుక్కల నుండి పుట్టినవారమే”.

కుమారుడు ఇదే ప్రశ్నను తన తండ్రిని కూడా అడిగాడు.

అందుకు తండ్రి సమాధానం మరోలా ఉంది: “మీ అమ్మ ఎంత త్యాగం చేసిందో నాకు తెలియదు. నిన్ను పెంచడానికి ఆమె ఎంత కష్టపడిందో కూడా నాకు తెలియదు. కానీ ఆమె ఓర్పు, పట్టుదల వల్లే ఈరోజు మన కుటుంబం ఈ స్థితిలో ఉంది. నా సంపాదనకు తగ్గట్టుగా ఆమె ఖర్చులను సర్దుబాటు చేసేది. తనకు కావాల్సిన దేనినీ ఆమె ఇప్పటివరకు నన్ను అడగలేదు. మీ కోసమే ఆమె నాతో గొడవపడేది. ఆమె చేసిన త్యాగం ముందు నేను చేసింది చాలా స్వల్పం” అన్నాడు.

అప్పుడు ఆ కుమారుడు తన సోదరులతో ఇలా అన్నాడు: “ఈ ప్రపంచంలో మనకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. తండ్రి త్యాగాన్ని అర్థం చేసుకునే తల్లి, తల్లి త్యాగాన్ని గౌరవించే తండ్రి ఉన్న ప్రతి కుటుంబం ఒక స్వర్గమే. తల్లిదండ్రులు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక కిరీటంలో ఉండే రెండు వజ్రాల వంటివారు. వారిని మనతోనే ఉంచుకుని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుందాం”.


Posted

in

by

Tags: