మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
జగిత్యాల జిల్లాకు చెందిన అంజయ్య, రజిత దంపతులకు వివాహమై ఏడేళ్లు అవుతోంది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిత గత కొంతకాలంగా పిల్లలతో కలిసి లింగాపూర్లోని తన పుట్టింట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో ఆదివారం పిల్లలను చూసేందుకు భర్త రాగా, ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భర్త వెళ్లిపోయిన కొద్దిసేపటికే తీవ్ర మనస్తాపానికి గురైన రజిత, ఇంట్లో నిద్రిస్తున్న 18 నెలల కుమారుడిని అక్కడే వదిలేసి, 6 ఏళ్ల కుమార్తె అక్షితను తన నడుముకు చీరతో కట్టుకుని సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు రజిత తన సోదరికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు సమాచారం అందించడం గమనార్హం.

Leave a Reply