“తీసుకోండి.. తీసుకోండి!”: ఇషాన్ కిషన్‌ను ఒప్పించిన 15 ఏళ్ల వైభవ్.. డీఆర్‌ఎస్‌లో అదిరిపోయే ట్విస్ట్.. అభిమానులను ఆశ్చర్యపరిచిన ఘటన!

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన క్రికెట్ అవగాహనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈసారి బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా, మైదానంలో తీసుకున్న ఒక కీలక నిర్ణయంతో అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డీఆర్‌ఎస్ (DRS) తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో, వైభవ్ పదే పదే ‘తీసుకోండి.. తీసుకోండి’ అంటూ ఒత్తిడి తెచ్చాడు. చివరకు ఇషాన్ అతని సలహాను నమ్మి డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఫలించి, ఈస్ట్ జోన్ జట్టుకు అత్యంత కీలకమైన వికెట్ లభించింది.

సౌత్ జోన్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌ను ముకేశ్ కుమార్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో రికీ భుయ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. లెగ్ సైడ్ వైపు వెళ్లిన బంతికి ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో డీఆర్‌ఎస్ తీసుకోవాలా వద్దా అని ఇషాన్ కిషన్ కాస్త గందరగోళానికి గురయ్యాడు. ఆ సమయంలో సమీపంలోనే ఉన్న వైభవ్ సూర్యవంశీ ‘తీసుకోండి.. తీసుకోండి’ (లే లో.. లే లో) అని కెప్టెన్‌ను ఒప్పించి రివ్యూ తీసుకునేలా చేశాడు.

రివ్యూలో అల్ట్రాఎడ్జ్ (UltraEdge) ద్వారా బంతి బ్యాట్ అంచును తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అనంతరం వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రా పట్టిన క్యాచ్‌ను కూడా రీప్లేలో పరిశీలించి ఫెయిర్ క్యాచ్‌గా నిర్ధారించారు. దాంతో థర్డ్ అంపైర్ రికీ భుయ్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అతను కేవలం 1 పరుగుకే వెనుదిరగడంతో సౌత్ జోన్ జట్టు 10 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దీని ద్వారా వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన సలహా సరైనదేనని తేలింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన వైభవ్, మైదానంలో ఇలాంటి కీలక సమయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 708 పరుగులు చేయగా, కెప్టెన్ ఇషాన్ కిషన్ 270 పరుగులు, వైభవ్ 44 పరుగులు చేశారు. గత మ్యాచ్‌లలోనూ వైభవ్ సలహాతో తీసుకున్న డీఆర్‌ఎస్ నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చిన నేపథ్యంలో, మైదానంలో అతని డీఆర్‌ఎస్ జడ్జిమెంట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: