పెరంబలూరు: తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వేప్పూర్ ప్రాంతానికి చెందిన నిషాందిని (26) కి, ఆమె భర్త గుణశేఖరన్కు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగా గత ఐదేళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. కారై సమతువపురం ప్రాంతంలో తన 9 ఏళ్ల కుమార్తె కీర్తిషాతో కలిసి నిషాందిని విడిగా నివసిస్తోంది.
ఈ క్రమంలో నిషాందినికి మణివణ్ణన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.
రోజులు గడుస్తున్న కొద్దీ, మణివణ్ణన్ తన కూతురిని వదిలేసి, ఒంటరిగా తనతో వచ్చేయాలని నిషాందినిని వేధించడం ప్రారంభించాడు. ప్రియుడితో కలిసి జీవించడానికి, వారి పెళ్లికి తన 9 ఏళ్ల కుమార్తె కీర్తిషా అడ్డంగా ఉందని నిషాందిని భావించింది. ఈ క్రమంలోనే కన్నప్రేమను కూడా మరచి, కన్నకూతురిని గొంతు నొక్కి దారుణంగా హత్య చేసింది.
ఆసుపత్రిలో తల్లి హైడ్రామా
కూతురిని హత్య చేసిన తర్వాత, పాప స్పృహ తప్పి పడిపోయిందని చెబుతూ నిషాందిని కారై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి నాటకమాడింది. అయితే, బాలిక శరీరాన్ని పరీక్షించిన వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో తీవ్రంగా విచారించగా.. అక్రమ సంబంధం కోసమే కన్నతల్లి కూతురిని అంతమొందించినట్లు నిజం ఒప్పేసుకుంది. దీంతో నిషాందినిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అప్పటికే పరారైన ఆమె ప్రియుడు మణివణ్ణన్ను కూడా పోలీసులు గాలించి పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply