ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కోటీశ్వరుడైన తండ్రిని చంపిన ఘటన మరువక ముందే, ఇటావా జిల్లా జస్వంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలోయ్ గ్రామంలో ఒకే ఒక్క కొడుకు తన వృద్ధ తండ్రిని అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేశాడు.
వృద్ధుడైన తండ్రికి రాత్రి భోజనం పెట్టిన తర్వాత, కొడుకు ఆయన్ని కర్రలతో చితకబాది స్పృహ తప్పేలా చేశాడు. అనంతరం కట్టెలు, రగ్గులు, బట్టలు ఆయనపై వేసి నిప్పు అంటించి సజీవంగా తగలబెట్టాడు. తెల్లారిన తర్వాత ఏమీ తెలియనట్లు గ్రామస్తుల వద్దకు వెళ్లి తన తండ్రి కాలిపోయాడంటూ డ్రామా ఆడాడు.
జనవరి 26న లభ్యమైన సగం కాలిన మృతదేహం
రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు వృద్ధ రైతు మున్నాలాల్ మృతదేహం తన పొలం వద్ద ఉన్న చిన్న గదిలో కాలిపోయి కనిపించింది. హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. 78 ఏళ్ల తన తండ్రిని కర్రలతో కొట్టి చంపిన అనంతరం, గదిలో ఉన్న కట్టెలు, బట్టలు ఆయనపై వేసి నిప్పు పెట్టాడు. ఉదయం చూసేసరికి మృతదేహం 90 శాతం కాలిపోయింది.
ఘటనాస్థలంలో పోలీసులకు దొరికిన ఆధారాలు
హత్య వార్త తెలియగానే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి లోతుగా తనిఖీ చేయగా.. ఆ గుడిసె వెలుపల రక్తపు మరకలతో పాటు విరిగిన ఒక కర్ర దొరికింది. ఇది పోలీసులకు అనుమానం కలిగించింది.
పోలీసులను తప్పుదోవ పట్టించిన కొడుకు
మృతుడి ఏకైక కుమారుడు గజరాజ్ సింగ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాత్రి 8 గంటలకు తండ్రికి భోజనం పెట్టి వెళ్లానని, ఉదయం వచ్చి చూసేసరికి ఆయన కాలిపోయి ఉన్నాడని చెప్పాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తులు తన తండ్రిని చంపేశారని కేసు కూడా పెట్టాడు.
కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. మున్నాలాల్‌కు సుమారు 45 బిఘాల సాగు భూమి ఉంది. గజరాజ్ ఆ భూమిని అమ్మాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చేవాడు. కానీ తండ్రి అందుకు నిరాకరించాడు. ఆ ఆస్తి కోసమే కొడుకు ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు.
