దుబాయ్ చిహ్నంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బుర్జ్ ఖలీఫా భవనంలో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన భార్య సుచిత్ర పేరు మీద ఒక కొత్త లగ్జరీ నివాసాన్ని కొనుగోలు చేశారు. అంతర్జాతీయ ప్రముఖులు మాత్రమే నివసించే ఈ విఐపి (VIP) భవనంలో, మోహన్‌లాల్ కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు కొనడం సినిమా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
మోహన్‌లాల్ సర్ప్రైజ్: నటనలో ఎప్పుడూ తనదైన ముద్ర వేసే మోహన్‌లాల్, నిజ జీవితంలో కూడా కింగ్ సైజ్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతారు. ఇప్పుడు ఆయన చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫాలో, తన భార్య సుచిత్ర కోసం ఆయన ఒక అదిరిపోయే లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.
ధరల వివరాలు: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ప్రాపర్టీ ఫైండర్’ నివేదిక ప్రకారం, బుర్జ్ ఖలీఫాలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి.
- ఒక చిన్న స్టూడియో అపార్ట్‌మెంట్ కొనాలన్నా భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.4 కోట్ల నుండి రూ. 5.7 కోట్ల వరకు ఖర్చవుతుంది.
- మోహన్‌లాల్ కొనుగోలు చేసిన ఒక బెడ్‌రూమ్ లగ్జరీ అపార్ట్‌మెంట్ ధర రూ. 5 కోట్ల నుండి రూ. 9 కోట్ల వరకు ఉండవచ్చు.
- రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లు రూ. 10 కోట్ల నుండి రూ. 16 కోట్ల వరకు, మూడు బెడ్‌రూమ్‌ల ఇళ్లు రూ. 20 కోట్ల పైన విక్రయించబడతాయి.
- ఇక అత్యంత ఖరీదైన పెెంట్‌హౌస్‌లు, అర్మానీ రెసిడెన్సీల ధరలు రూ. 80 కోట్ల నుండి రూ. 230 కోట్లకు పైగానే ఉంటాయి. దీనికి రిజిస్ట్రేషన్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులు అదనం.
లాల్ ఏట్టన్ కొత్త నివాసం: మోహన్‌లాల్ కొన్న అపార్ట్‌మెంట్ 29వ అంతస్తులో ఉంది. అక్కడి నుండి కిటికీ గుండా చూస్తే దుబాయ్ ఫౌంటైన్ అందాలు కనువిందు చేస్తాయి. మోహన్‌లాల్‌కి ఇప్పటికే దుబాయ్ తీరంలో ఒక బంగళా ఉన్నప్పటికీ, షూటింగ్ అలసట నుండి ఉపశమనం పొందేందుకు, ప్రశాంతంగా గడపడానికి బుర్జ్ ఖలీఫాలోని ఈ ఇంటిని ఎంచుకున్నారట.
అక్కడ నివసించే ప్రముఖులు: ఈ విఐపి భవనంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇప్పటికే ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కలిగి ఉన్నారు. 2009లో డేవిడ్ బెక్హాం, 2010లో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టికి పెళ్లి కానుకగా ఇక్కడే ఇల్లు కొని ఇచ్చారు. వీరి సరసన ఇప్పుడు మన మోహన్‌లాల్ కూడా చేరడం విశేషం.
