ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్‌లో ఉన్న జగత్ ప్రసిద్ధ మా వింధ్యవాసిని ఆలయంలో, దర్శనం చేయించడం గురించిన పాత కక్షలతో రెండు వర్గాల పూజారుల మధ్య భయంకర ఘర్షణ చెలరేగింది.
జూలై 30వ తేదీన ఆలయ గర్భగుడిలో ప్రారంభమైన ఈ వాగ్వాదం, కొన్ని నిమిషాల్లోనే మాటల యుద్ధాన్ని దాటి చేయి చేసుకునే వరకు వెళ్లింది. అక్కడితో వదలకుండా వెంటాడి వెళ్లిన తండ్రీకొడుకులతో కూడిన ఒక వర్గం, మరొక పూజారిని వింధ్య వరాండా ప్రాంతం మరియు పాత విఐపి రోడ్డు వరకు వెెళ్లి వరుసగా దారుణంగా కొట్టారు.
భక్తులతో కిక్కిరిసిపోయిన పవిత్ర పుణ్యక్షేత్రంలో, భద్రతా విధుల్లో పోలీసులు ఉన్నప్పటికీ వారివల్ల ఈ గొడవను ప్రారంభంలో అదుపు చేయడం సాధ్యపడలేదు. గర్భగుడిలో ప్రారంభమై నడవా వరకు సాగిన ఈ ఘర్షణలో, ఇరు వర్గాల వారు ఒకరినొకరు కర్రలతో, పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టుకున్న దృశ్యాలు ఆలయ సీసీటీవీ కెమెరాలో రికార్డయి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. హఠాత్తుగా జరిగిన ఈ దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఇతర ప్రాంతాల భక్తులు, ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో అరుస్తూ పారిపోవడంతో అక్కడ తీవ్ర కలకలం, గందరగోళం నెలకొంది.
ఈ సంఘటన అనంతరం ఇరు వర్గాల వారిని వింధ్యాచల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ జరిగిన సంప్రదింపుల తర్వాత కేసును నివారించేలా తమలో తాము కాంప్రమైజ్ అయి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయినప్పటికీ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఇటువంటి పవిత్ర క్షేత్రాలలో ఆలయ పూజారులే ప్రజల ముందే నడిరోడ్డుపై, గర్భగుడిలో ఇలా కొట్టుకోవడం భక్తులలో అసంతృప్తిని కలిగించింది. ఇటువంటి సంఘటనలు ఆలయ ప్రాంగణపు మంచి పేరును దెబ్బతీయడమే కాకుండా, వచ్చే భక్తుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply