గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లా వాపీ సమీపంలోని ఒక నగల దుకాణంలోకి చోరీ చేయడానికి వెళ్లిన ఇద్దరు దొంగలకు ఊహించని షాక్ తగిలింది.
రాత్రి వేళలో ఎలక్ట్రిక్ కట్టర్‌ను ఉపయోగించి షాప్ షట్టర్ తాళాలను కత్తిరించి దొంగలు లోపలికి చొరబడ్డారు. కట్టర్ శబ్దం విన్న స్థానికులు వెంటనే మేల్కొన్నారు. దీంతో షాప్ యజమానితో పాటు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
లోపల దొంగలు ఉన్నారని గుర్తించిన స్థానికులు, వారు బయటకు తప్పించుకోకుండా ఉండేలా షట్టర్‌ను బయటి నుంచి కిందకు లాగి గట్టిగా మూసివేశారు. దీంతో లోపలే బందీలుగా చిక్కుకుపోయిన ఆ ఇద్దరు దొంగలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయట పెద్ద ఎత్తున జనం గుమిగూడటం, బయటకు వస్తే చితకబాదుతారేమోనన్న ప్రాణభయంతో ఏం చేయాలో పాలుపోక వణికిపోయారు. తమను బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, చివరకు దొంగలే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ (112)కు ఫోన్ చేశారు.
తాము నగల దుకాణంలో ఇరుక్కుపోయామని, బయట జనం చుట్టుముట్టారని, వెంటనే వచ్చి తమ్ము కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే నైట్ పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం దుకాణం షట్టర్ తెరిచి, లోపల ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో వారి బారి నుంచి దొంగలను సురక్షితంగా రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దొంగతనానికి వచ్చిన వాళ్లే ప్రాణభయంతో పోలీసుల సహాయం కోరిన ఈ వింత ఘటన స్థానికంగా నవ్వులు పూయించడంతో పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.
