ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో ‘కొత్త లోకం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టిస్తోంది కల్యాణీ ప్రియదర్శన్. అయితే, ఆమె అసలు నటి కావాలని అనుకోలేదన్న విషయం మీకు తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆర్కిటెక్ట్ కావాలనుకుని.. హీరోయిన్ అయ్యింది!
కల్యాణికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, కనీసం షూటింగ్ సెట్స్‌కు రావడానికి కూడా ఇష్టపడేది కాదని ప్రియదర్శన్ తెలిపారు. ఆమె లక్ష్యం కేవలం ‘ఆర్కిటెక్ట్’ కావడం మాత్రమే. కానీ ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
- ఆ ఫోన్ కాల్ ఎవరిదంటే?: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకరోజు ప్రియదర్శన్‌కు ఫోన్ చేసి, అఖిల్ అక్కినేని సరసన ‘హలో!’ సినిమాలో హీరోయిన్గా కల్యాణిని అనుకుంటున్నట్లు చెప్పారు.
- తండ్రి సమాధానం: “నా కూతురికి నటన రాదు.. తను నటించలేదని చెప్పాను” అని ప్రియదర్శన్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.
- కల్యాణి నిర్ణయం: అయితే, కల్యాణి మాత్రం “ఒక్కసారి ప్రయత్నిస్తాను నాన్నా.. ఒకవేళ సెట్ కాకపోతే మళ్ళీ నా ఆర్కిటెక్ట్ ప్రయత్నాలు నేను చేసుకుంటా” అని చెప్పి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
భాష రాకపోయినా.. వెనకడుగు వేయలేదు!
కేరళలో పెరగకపోవడం వల్ల కల్యాణికి మొదట్లో మలయాళం మాట్లాడటం రాకపోయేదని, దానివల్ల కెరీర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన తెలిపారు. అయినప్పటికీ, పట్టుదలతో అన్నీ నేర్చుకుని ఈరోజు మలయాళంలో టాప్ హీరోయిన్గా ఎదగడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
ఫ్లాష్ బ్యాక్: 2017లో విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘హలో!’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కల్యాణి, ఆ తర్వాత తెలుగులో ‘చిత్రలహరి’, ‘రణరంగం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
