సహజంగా రోడ్డుపై వాహనాలు నడుపుతున్నప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు లేదా ఢీకొనడం వంటివి జరగడం సాధారణమే. కానీ, ఇలాంటి సందర్భాల్లో చాలామంది తమ సహనాన్ని కోల్పోయి ఆగ్రహంతో గొడవలకు, కొట్లాటకు దిగడం మనం చూస్తుంటాం.
అయితే, ఉత్తరాఖండ్లో జరిగిన ఒక ఘటన ఇందుకు పూర్తిగా భిన్నంగా నిలిచి, మానవత్వానికి చక్కటి ఉదాహరణగా మారింది.
అక్కడ ఓ చిన్న రంగుల (ఎరుపు రంగు) కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని స్వల్పంగా ఢీకొట్టింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పెద్ద గొడవగా మారుతుంది. కానీ, ఈ ఘటనలో కారు నడుపుతున్న డ్రైవర్ వెంటనే కిందికి దిగి వచ్చి, దెబ్బ తగిలిన వ్యక్తికి ఎలా ఉందని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, ఆయన్ని ప్రేమగా హత్తుకుని తన క్షమాపణలను, విచారాన్ని తెలియజేశాడు.
ఇందుకు సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలను ఉత్తరాఖండ్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ (X) పేజీలో షేర్ చేశారు. ఆ వీడియోలో, లేత రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఎరుపు రంగు కారు ఆయనకు తగులుతుంది. వెంటనే కారు ఆపిన డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తి యమక్షేమాలు అడిగి, ఆలింగనం చేసుకుంటాడు. ఇద్దరూ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వీడియోను పంచుకున్న ఉత్తరాఖండ్ పోలీసులు, ఆ కారు డ్రైవర్ చూపిన సంయమనాన్ని, మానవత్వాన్ని ఎంతగానో కొనియాడారు. రోడ్డుపై చిన్న చిన్న పొరపాట్లు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు కోపగించుకోవడం, గొడవ పడడం మానేసి.. బాధ్యతగా, మానవత్వంతో మెలుగాలనే మంచి సందేశాన్ని ప్రజలకు చాటడానికే తాము ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “రోడ్డుపై వెళ్లేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు” అని ఒకరు అభిప్రాయపడగా, “ప్రమాదాలు జరిగినప్పుడు గొడవ పడడం కంటే ప్రశాంతంగా మాట్లాడుకోవడమే సమస్యను పెద్దది కాకుండా ఆపుతుంది” అని పలువురు కారు డ్రైవర్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

Leave a Reply