పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పట్టపగలు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపిన దిగ్భ్రాంతికర వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపింది.
ఈ దాడిలో మృతి చెందిన వ్యక్తి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మరియు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న సీనియర్ కమాండర్ ‘ఇమ్రాన్’ అని ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వెలుగులోకి వచ్చిన వీడియో ప్రకారం.. అక్టోబర్ 13 ఉదయం ఒక వ్యక్తి ప్రాంగణ ప్రధాన ద్వారం నుంచి బైక్‌పై బయటకు వస్తుండగా, తెల్లటి దుస్తులు ధరించిన దుండగుడు అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి తప్పించుకోవడానికి యత్నించినప్పటికీ నియంత్రణ కోల్పోయి కింద పడిపోయాడు. వదలకుండా వెంబడించిన హంతకుడు.. తన బ్యాగ్‌లో నుంచి మరో తుపాకీని తీసి మరీ పలుమార్లు కాల్చాడు. అనంతరం పని పూర్తయిందన్న సంకేతంగా చేతులు పైకెత్తి చూపిస్తూ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ వీడియో ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపిస్తుండగా.. హతమైన వ్యక్తి లష్కరే తోయిబా కీలక నేత ఇమ్రాన్ మాత్రమేనని పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే కాల్పులకు గురైన వ్యక్తి అసలు గుర్తింపు, ఈ ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం మరియు దీని వెనుక ఉన్న నేపథ్యంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు వెల్లడికాలేదు.
పాకిస్థాన్ పోలీసులు గానీ, పంజాబ్ ప్రావిన్స్ యంత్రాంగం గానీ లేదా అక్కడి సైన్యం గానీ ఈ ఘటనపై, అలాగే లష్కరే కమాండర్ మరణంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ దాడి వీడియో ప్రామాణికత, మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించబడలేదు

Leave a Reply