మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో చోటుచేసుకున్న ఒక అమానవీయ ఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది.
డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైన చికిత్స అందక ఓ నిరుపేద మహిళ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కనీసం అంత్యక్రియలు చేసే స్థోమత లేక ఆమె భర్త తల్లడిల్లిన తీరు ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది.
“నా దగ్గర నయా పైసా కూడా లేదు.. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రతిసారీ డ్రెస్సింగ్ (కట్టు) వేయడానికి డబ్బులు అడిగారు. డబ్బులు అయిపోగానే కట్టు కట్టడం ఆపేశారు, చివరకు నా భార్య ఊపిరి కూడా ఆగిపోయింది. ఆమెకు అంత్యక్రియలు చేయడానికి కూడా నా దగ్గర చిల్లిగవ్వ లేదు, అందుకే ఆమె మృతదేహాన్ని నర్మదా నదిలో వదిలేయాలనుకున్నాను.. కనీసం చనిపోయాకైనా ఆమె చేపలకైనా ఆహారంగా మారుతుంది” అంటూ 51 ఏళ్ల శ్యామ్ విశ్వకర్మ కన్నీరుమున్నీరవుతూ చెప్పిన మాటలు చూపరుల చేత కన్నీళ్లు పెట్టించాయి.
జబల్పూర్ జిల్లా కేంద్రానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మగర్మున్హా గ్రామానికి చెందిన శ్యామ్ రోజువారీ కూలీ. ఆయన భార్య ఆర్తి విశ్వకర్మ (41) ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కాలికి సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా డ్రెస్సింగ్ చేయాలని వైద్యులు సూచించారు. కుటుంబ పేదరికాన్ని గమనించిన ఆమె మైనర్ కొడుకు రాజు.. దాబాలు, హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడుగుతూ, కూలీ పనులు చేస్తూ సంపాదించిన ప్రతి రూపాయిని తల్లి వైద్యానికే వెచ్చించాడు.
దాదాపు రూ. 5,000 నుండి రూ. 7,000 వరకు ఖర్చు చేసినా పరిస్థితి విషమించడంతో, ఆర్తిని జిల్లా ఆసుపత్రిలోని గ్యాంగ్రీన్ (Gangrene) వార్డులో చేర్పించారు. అక్కడ ప్రతిసారీ కట్టు వేయడానికి సిబ్బంది రూ. 100 లంచం డిమాండ్ చేశారని శ్యామ్ ఆరోపించారు. రెండు రోజుల పాటు ఎవరి దగ్గరో అప్పు చేసి ఎలాగోలా డబ్బులిచ్చారు; కానీ, జేబు పూర్తిగా ఖాళీ అయిపోవడంతో ఆరోగ్య సిబ్బంది కట్టు కట్టడం మానేశారు. 48 గంటల పాటు డ్రెస్సింగ్ చేయకపోవడంతో గాయంలో పురుగులు పట్టి, భరించలేని నొప్పితో ఆర్తి ప్రాణాలు విడిచింది.
భార్య మృతి చెందిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేకపోవడంతో, ఆసుపత్రి నుంచి శవాన్ని రహస్యంగా తరలించడానికి శ్యామ్ ప్రయత్నించాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు గమనించి ఆపగా, శ్యామ్ తన దీనస్థితిని వివరించి రోదించాడు. ఈ ఘటనపై ముఖ్య వైద్యాధికారి (CMHO) డాక్టర్ నవీన్ కొఠారి స్పందిస్తూ.. గ్యాంగ్రీన్ వార్డులో డ్రెస్సింగ్ చేసే సిబ్బందికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక భత్యం అందుతుందని, అవినీతి ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విషయం తీవ్రతను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ‘గరీబ్ నవాజ్ కమిటీ’కి చెందిన ఇనాయత్ అలీకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఇనాయత్ అలీ బృందం, హిందూ సంప్రదాయం ప్రకారం స్వచ్ఛందంగా ఆర్తి అంత్యక్రియలను పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. “సరైన సమయానికి శ్యామ్ను ఆపకపోయి ఉంటే, ఈ పేదరికపు వేదన
