వారణాసి: వారణాసిలో నర్సింగ్ విద్యార్థిని ఫలక్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. విద్యార్థిని ఆరోగ్యం క్షీణించినప్పటికీ, ఆమెను సరైన సమయానికి ఆసుపత్రికి తరలించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడైన యువకుడు విద్యార్థినిని గదిలోనే బంధించి, ఈ క్రమంలో ఆధారాలను తుడిచేసేందుకు కూడా ప్రయత్నించాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు నిందితుడు మహ్మద్ సమీర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 10వ తేదీ ఉదయం సదరు విద్యార్థిని తనకు పరిచయమున్న మహ్మద్ సమీర్ గదికి వెళ్లింది. విచారణలో ఆమె ప్రియుడు (సమీర్) ఆమెతో అత్యంత క్రూరమైన పద్ధతిలో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాతే విద్యార్థిని ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని తేలింది. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆమెకు తక్షణ వైద్య సహాయం అందించలేదని ఆరోపణలు వచ్చాయి.
గదిలోనే తల్లడిల్లిన బాధితురాలు:
దర్యాప్తులో మరో షాకింగ్ నిజం కూడా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సుమారు గంటన్నర పాటు గదిలోనే నొప్పితో కేకలు వేస్తూ, తల్లడిల్లిపోయినా నిందితుడు సమీర్‌కు ఏమాత్రం జాలి కలగలేదు. ఆమె పరిస్థితి నిమిష నిమిషానికి దిగజారిపోయింది. సరైన సమయానికి చికిత్స అందకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది.
మొబైల్ పగులగొట్టి ఆధారాల ధ్వంసం:
నిందితుడు బాధితురాలి మొబైల్ ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను నశింపజేయాలనే ఉద్దేశంతోనే.. ఫోన్‌ను పగులగొట్టి గదిలోని కూలర్లో పడేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కోణంలో పోలీసులు ప్రస్తుతం టెక్నికల్ దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తు అధికారుల ప్రకారం.. విద్యార్థిని పరిస్థితి అత్యంత దారుణంగా మారినప్పుడు, నిందితుడు ఆమెను గది బయట మెట్ల వద్ద వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు:
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, అలాగే పోస్ట్‌మార్టం (శవపరీక్ష) నివేదిక ఆధారంగా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో లభించిన పక్కా ఆధారాల ప్రకారం మహ్మద్ సమీర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించి జైలుకు తరలించింది.
అసలేం జరిగిందంటే?
మృతి చెందిన విద్యార్థిని అసలు నివాసం బల్లియా జిల్లా. ఆమె వారణాసిలో తన తల్లితో కలిసి ఉంటూ జీఎన్ఎమ్ (GNM) నర్సింగ్ చదువుతోంది. బుధవారం నాడు ఆమె సారనాథ్ ప్రాంతంలోని ఒక పేయింగ్ గెస్ట్ హౌస్ మెట్లపై మృతదేహమై కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఎలక్ట్రానిక్ ఆధారాలతో సహా అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా తదుపరి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply