ముగ్గురిని పెళ్లాడి విడాకులు తీసుకున్న మహిళను వివాహం చేసుకున్న ఓ యువ పారిశ్రామికవేత్త, పెళ్లయిన 12 రోజులకే విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉడిపిలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి తోడు, సదరు మహిళ వల్ల ఇదివరకే బాధితుడిగా మారిన మరో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది.
ఉడిపి జిల్లా నెాల్యాడికి చెందిన 30 ఏళ్ల వ్యాపారి సుదీప్, మంగళూరుకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ సౌమ్యను ప్రేమించి గత ఫిబ్రవరి 17న వివాహం చేసుకున్నాడు. సౌమ్యకు ఇది 4వ వివాహం. ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. వీరి వివాహాన్ని సుదీప్ ఇంట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.
12 రోజులకే విషాదం
పెళ్లయిన కొద్దిరోజులకే కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా సుదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. మనస్తాపం చెందిన ఆయన గత నెల 22న విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో మంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 29న సుదీప్ మృతి చెందాడు. సుదీప్ మరణించిన వార్త తెలిసినప్పటికీ, భార్య సౌమ్య ఆయన మృతదేహాన్ని చూడటానికి రాలేదని సమాచారం.
తండ్రి ఫిర్యాదు – సౌమ్య వాదన
ఈ మరణంపై సుదీప్ తండ్రి దామోదర్ కార్కల నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణానికి కోడలు సౌమ్యనే కారణమని, ఆమె ఇచ్చిన మానసిక వేధింపుల వల్లే సుదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో సౌమ్య మాట్లాడుతూ.. “మేము ఏడాది కాలంగా ప్రేమించుకున్నాం. సుదీప్ ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకున్నాడు. నా గత జీవితం గురించి అన్ని నిజాలు ముందే చెప్పాను. సుదీప్ ఇంట్లో వాళ్లు మా పెళ్లిని అంగీకరించకపోవడమే ఆయన ఆత్మహత్యకు కారణం కావచ్చు. నాపై ఫిర్యాదు చేసిన వారిపై నేనూ ఫిర్యాదు చేస్తాను” అని తెలిపింది.
బయటపడ్డ అసలు నిజాలు?
ఈ వివాదం నడుస్తుండగానే, ముల్కికి చెందిన వేణు శెట్టి అనే వ్యక్తి సౌమ్యపై సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. సౌమ్యకు 19 ఏళ్లకే మొదటి వివాహం జరిగిందని, ఆమె పథకం ప్రకారం యువకులను మోసం చేస్తోందని ఆరోపించాడు. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై నిశ్చితార్థం వరకు వెళ్లామని, కానీ ఆమె అసలు స్వరూపం తెలిసి పెళ్లి ఆపేయడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొన్నాడు. ఆమె లక్ష్యం కేవలం మగవారి నుండి డబ్బు వసూలు చేయడమేనని వేణు బహిరంగంగా విమర్శించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
