నవరాత్రుల పది రోజులూ మహిళలకు ప్రవేశం నిషిద్ధం! బీహార్‌లోని ఆశాపురి మాత ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వింత సంప్రదాయం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
నలంద జిల్లా గిరియక్ పరిధిలోని ఘోస్రావాన్ గ్రామంలో ఈ ప్రసిద్ధ ఆలయం కొలువై ఉంది. శారదీయ నవరాత్రుల మొదటి రోజైన పాడ్యమి నుంచి విజయదశమి హారతి పూర్తయ్యేంత వరకు మహిళలు ఈ ఆలయంలోకి అడుగుపెట్టడానికి అనుమతించరు.
ఆలయ అర్చకులు, స్థానిక గ్రామస్థుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతం పురాతన కాలం నుంచే తాంత్రిక సాధనలకు, విశేష పూజలకు ప్రసిద్ధి చెందింది. నవరాత్రి పది రోజులూ ఇక్కడ ప్రత్యేక తాంత్రిక పూజలు జరుగుతాయని, ఆ పూజా నియమావళి, సంప్రదాయాల ప్రకారమే మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తారని చెబుతారు. అయితే, ఈ ఆచారానికి గల ఖచ్చితమైన చారిత్రక ఆధారాల గురించి స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు.
స్థానిక పురాణ గాథల ప్రకారం.. బౌద్ధుల కాలంలో ఈ ప్రాంతానికి వచ్చిన బౌద్ధ సన్యాసులు తమ కోరికలను ఇక్కడి అమ్మవారి ముందు విన్నవించుకునేవారని సమాచారం. వారు కోరిన కోర్కెలు నెరవేరడంతో ఈ ప్రదేశానికి ‘ఆశాపురి’ అనే పేరు వచ్చినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాకుండా, పూర్వం ఘోష్ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారని, అమ్మవారు ఇక్కడే స్వయంభువుగా వెలిశారని కూడా ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది.
పది రోజుల పాటు మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఈ ఆలయానికి బీహార్‌తో పాటు కోల్‌కతా, ఒడిశా, మధ్యప్రదేశ్, అసోం, ఢిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి పూజా పద్ధతులు, తాంత్రిక సంప్రదాయాలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిబంధనలు ఇప్పటికీ ఎందరికో ఆసక్తికరమైన అంశంగానే కొనసాగుతున్నాయి.

Leave a Reply