లక్నో: పెళ్లయిన కేవలం 14వ రోజే ఒక నవవధువు మరణించిన ఘటన చోటుచేసుకుంది. రెండవ అంతస్తు నుండి కింద పడిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అత్తగారింటి వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆమె అప్పటికే మృతి చెందింది. అసలు ఆమె రెండవ అంతస్తు నుండి కింద ఎలా పడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో జరిగింది.
మృతురాలి పేరు ప్రియాంక మిశ్రా (30). ఇంటి పైకప్పు (టెర్రస్) మీద ఉన్న ప్రహరీ గోడపై కాలు పెట్టి ప్రియాంక సరదాగా ఆటపట్టిస్తోందని, అంతలోనే ఆమె అదుపు తప్పి కింద పడిపోయిందని ఆమె భర్త శుభమ్ పేర్కొన్నాడు. అయితే పోలీసులకు ఈ వ్యవహారం మొత్తం అనుమానాస్పదంగా అనిపిస్తోంది. దీంతో వారు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియాంక మిశ్రా స్వస్థలం గోరఖ్పూర్ జిల్లా. ఆమె తండ్రి కస్టమ్స్ విభాగంలో రిటైర్డ్ అధికారి. ప్రియాంక చదువులో చాలా చురుకైనది, ఆమె బి.ఈడి (B.Ed) పూర్తి చేసింది. ఏప్రిల్ 28న ఝాన్సీకి చెందిన శుభమ్తో ఆమె వివాహం జరిగింది.
శుభమ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడాదిన్నర క్రితం ‘జీవన్ సాథి’ మ్యాట్రిమోనీ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. చాలా కాలం పాటు మాట్లాడుకున్నాక, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఏప్రిల్ 28న వీరి వివాహం ఘనంగా జరిగింది. మే 2వ తేదీన రిసెప్షన్ నిర్వహించారు.
సోమవారం ఇంట్లో ఒక కార్యక్రమం ఉండటంతో అతిథులను భోజనానికి ఆహ్వానించారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో ప్రియాంక తన గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత కొంత సమయానికి ప్రియాంక మరియు శుభమ్ ఇంటి పైకప్పు మీదకు వెళ్లారు. అక్కడ ప్రియాంక రక్షణ గోడపై సరదాగా కాళ్లు వేలాడదీస్తూ ఆటపట్టిస్తోందని, తాను వద్దని వారించినా ఆమె వినలేదని, ఈ క్రమంలోనే ఆమె కింద పడిపోయిందని శుభమ్ చెబుతున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రియాంక మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండలో వారిద్దరూ అంత సేపు డాబా మీద ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మరణానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. భర్తతో సహా అందరి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారు.
