ముంబై: ముంబైకి చెందిన ఒక దంపతుల జీవితంలో చోటుచేసుకున్న వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం భార్యకు కిడ్నీ (మూత్రపిండం) పూర్తిగా పాడైపోయినప్పుడు.. ఆమెపై ఉన్న ప్రేమతో భర్త తన ఒక కిడ్నీని దానంగా ఇచ్చి, భార్యకు పునర్జన్మ ప్రసాదించాడు.
అయితే, ప్రాణాలతో బయటపడిన సదరు భార్య.. ఇప్పుడు తన ప్రియుడితో కలిసి జీవించడం కోసం, తనకు ప్రాణభిక్ష పెట్టిన భర్త నుండి విడాకులు కావాలంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించింది.
భర్త పెట్టిన వింత నిబంధన!
భార్య చేసిన ఈ ఊహించని నమ్మకద్రోహంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన భర్త.. ఆమెకు విడాకులు ఇవ్వడానికి ఒక విచిత్రమైన, కఠినమైన నిబంధనను విధించాడు.
“నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటే.. నేను నీకు దానంగా ఇచ్చిన నా కిడ్నీని తీసి నాకు తిరిగి ఇచ్చేయ్. అప్పుడే నేను నీకు విడాకులు ఇస్తాను, లేదంటే ఇచ్చే ప్రసక్తే లేదు” అని ఆయన భీష్మించుకు కూర్చున్నాడు.
ప్రేమ కోసం ఎంతో ఉదారంగా కిడ్నీని దానం చేసి, ఇప్పుడు విడాకుల కోసం దానిని తిరిగి ఇవ్వాలంటూ భర్త పెట్టిన ఈ వింత నిబంధన మొత్తం సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పవిత్రమైన బంధానికి, నమ్మకద్రోహానికి మధ్య జరుగుతున్న ఈ వివాదంలో నెటిజన్లు భర్త వైపే మొగ్గు చూపుతూ భార్య తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
