షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి దిగ్గజ నటులతో కలిసి పనిచేసి మెప్పించిన నటి గిరిజా ఓక్, ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన కుమారుడు కబీర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. పిల్లలకు చిన్న వయసులోనే శారీరక మార్పులు మరియు మహిళల రుతుక్రమం గురించి అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో ఆమె ఈ సందర్భంగా వివరించారు.
అసలేం జరిగింది? గిరిజా ఓక్ కుమారుడు కబీర్‌కు ప్రస్తుతం 12 ఏళ్లు. ఆమె తన కొడుకుకు పీరియడ్స్ గురించి అన్ని విషయాలు వివరించారు. ఒకరోజు పాఠశాల ముగిసిన తర్వాత, కబీర్ క్లాస్‌మేట్ అయిన ఒక అమ్మాయి తల్లి గిరిజా భర్త సుహృదయ్‌కు ఫోన్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. “మీ అబ్బాయికి పీరియడ్స్ గురించి ముందే చెప్పారా? కబీర్ చాలా సంస్కారంగా ప్రవర్తించాడు, అందుకు మీకు ధన్యవాదాలు” అని ప్రశంసించారు.
కబీర్ చేసిన సహాయం: ఆ రోజు పాఠశాలలో ఆ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి. స్కూల్ అయిపోయిన తర్వాత మెట్రోలో ఇంటికి వెళ్తున్న సమయంలో, కబీర్ ఆ అమ్మాయి పడుతున్న ఇబ్బందిని గమనించాడు. వెంటనే అతను మెట్రోలో పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక సీటును పట్టుకుని, ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాక తన తల్లికి చెప్పడంతో, ఆమె గిరిజా కుటుంబానికి ఫోన్ చేసి అభినందించారు.
సరైన సంస్కారం: ఈ విషయం తెలుసుకున్న గిరిజా ఓక్ ఎంతో సంతోషించారు. ఆమె మాట్లాడుతూ.. “నా కొడుకుకు సరైన సంస్కారం నేర్పామని నాకు అర్థమైంది. మా ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు ఉండటం వల్ల, జంతువులకు మరియు మనుషులకు ఉండే ‘మెన్‌స్ట్రువల్ సైకిల్’ (Menstrual Cycle) మధ్య తేడాను కూడా నేను అతనికి వివరించాను. అందుకే అతను ఆ పరిస్థితిని అర్థం చేసుకుని గౌరవంగా ప్రవర్తించాడు” అని చెప్పుకొచ్చారు.
