ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పాఠశాల 3వ అంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తున్న వేద్ ప్రకాష్ (30) అనే యువకుడు, అకస్మాత్తుగా కిందపడి మృతి చెందిన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అతడు పైనుంచి కింద పడిపోతున్న ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై బయటకు వచ్చాయి.
బుధవారం మధ్యాహ్నం 3:21 గంటల సమయంలో పాఠశాల 3వ అంతస్తులో పెయింట్ వేస్తుండగా, ఊహించని విధంగా వేద్ ప్రకాష్ పట్టు తప్పాడు. దీంతో నియంత్రణ కోల్పోయి అంతస్తు పైనుంచి నేరుగా కింద పడిపోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది చూసి షాక్‌కు గురైన తోటి కార్మికులు, అతడిని రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో (ICU) చేర్చి చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి వేద్ ప్రకాష్ ప్రాణాలు విడిచాడు. మరోవైపు అతడు భవనం పైనుంచి కింద పడుతున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటన అనంతరం, మృతుడి కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పటికీ, రాత్రి 7:30 గంటల తర్వాతే తమకు సమాచారం అందించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో సమాచారం ఇచ్చి మెరుగైన వైద్యం అందించి ఉంటే తమ కొడుకును కాపాడుకునేవారమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అంతేకాకుండా, ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు సేఫ్టీ బెల్ట్‌తో సహా ఎలాంటి భద్రతా పరికరాలను పాఠశాల యాజమాన్యం సమకూర్చలేదని వారు ఆరోపించారు. కార్మికుల భద్రత విషయంలో ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply