బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా జనతాదళ్ యునైటెడ్ (JD-U) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని నిశాంత్ పేర్కొన్నారు.
“పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉంటూ జేడీయూను ముందుకు తీసుకెళ్తాను. గత 20 ఏళ్లుగా మా నాన్నగారు చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తాను. నా తండ్రిని చూసి నేను గర్విస్తున్నాను,” అని నిశాంత్ అన్నారు. నితీష్ కుమార్ పై నమ్మకం ఉంచాలని ఆయన కార్యకర్తలను కోరారు.
రాజకీయాల్లో కొత్త మలుపు: నిశాంత్ కుమార్ ఎంట్రీతో బీహార్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పార్టీలో ఆయనకు త్వరలోనే కీలక పదవి లేదా పెద్ద బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. జేడీయూ భవిష్యత్తులో ఆయన పాత్ర అత్యంత కీలకం కానుంది.
ఢిల్లీకి నితీష్ కుమార్: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు, ఇప్పటికే దీనికి సంబంధించిన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఏప్రిల్ కల్లా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. నితీష్ కుమార్ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో ఏర్పడిన వెలితిని పూడ్చేందుకే నిశాంత్ కుమార్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీలో చేరిన అనంతరం నిశాంత్ కుమార్ బీహార్ అంతటా పర్యటించనున్నారు. నితీష్ కుమార్ లేని లోటును భర్తీ చేసేందుకు, భవిష్యత్తు నాయకుడిగా నిశాంత్ కుమార్ను సిద్ధం చేసే క్రమంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
