“నా పాప బాత్‌రూమ్‌ని చూస్తేనే భయంతో వణికిపోతోంది”.. ‘లిటిల్ స్కాలర్స్’ కేంద్రం అరాచకం.. వీడియో చూసి కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు..!!

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న ప్రముఖ ‘క్యాప్‌జెమిని’ (Capgemini) ఐటీ కంపెనీ ప్రాంగణంలో నడుస్తున్న ‘లిటిల్ స్కాలర్స్’ అనే డే-కేర్ సెంటర్‌లో, చిన్న పిల్లలను అత్యంత క్రూరంగా హింసిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక గుండెలు పిండే వీడియోలో, ఒక చిన్నారిని బాత్‌రూమ్‌లో బంధించి, తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్ ద్వారా “అమ్మా, అమ్మా” అని ఏడుస్తూ చూస్తున్న దృశ్యం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ షాకింగ్ వీడియో ఆధారంగా, 55 ఏళ్ల కాపలాదారు విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళా ఉద్యోగులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ఈ వ్యవహారంపై బాధితులైన దంపతులు మాట్లాడుతూ, “మా ఏకైక కుమార్తెను 8 నెలల క్రితమే ఇక్కడ చేర్పించాము. చేర్పించిన కొన్ని నెలలకే పాపకు బాత్‌రూమ్ అంటేనే భయం, అసహ్యం కలిగింది. స్నానానికి పిలిస్తేనే భయంతో వణికిపోయి పారిపోయేది. ఇప్పుడు ఈ వీడియో చూశాక గానీ అర్థం కాలేదు, పాప ఏడిచినందుకు ఆ దుర్మార్గులు ఆమెను బాత్‌రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టారని” కన్నీరుమున్నీరయ్యారు. మరో 3 ఏళ్ల బాబు తల్లిదండ్రులు కూడా, డే-కేర్ సిబ్బంది పిల్లలను కఠినమైన స్వరంతో బెదిరించి భయపెట్టారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా, పిల్లలను వాషింగ్ మెషీన్‌లో బంధించారనే ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నప్పటికీ, కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో, క్యాప్‌జెమిని సంస్థ ఆ డే-కేర్ సెంటర్‌ను వెంటనే తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *