బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన, పోలీసు శాఖపై ప్రజలకున్న నమ్మకాన్ని తీవ్రంగా ప్రశ్నించేలా చేసింది. పోలీసుల అమానుష ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఓ 20 ఏళ్ల యువకుడు, 200 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కి చేసిన నిరసన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ముజఫర్‌పూర్ జిల్లా రామ్‌నగర్ గ్రామానికి చెందిన అంకిత్ రాజ్ చౌదరి (20) అనే యువకుడి సెల్‌ఫోన్ నెలన్నర క్రితం చోరీకి గురైంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి దొంగను పట్టుకుని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం, చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ అంకిత్ తన ఫోన్‌ను తిరిగి పొందేందుకు కోర్టు నుంచి ‘రిలీజ్ ఆర్డర్’ తీసుకుని గాయ్‌ఘాట్ (Gaighat) పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న మహిళా సబ్-ఇన్స్పెక్టర్ (SI) కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఫోన్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు.
అంతేకాకుండా, తన హక్కును అడిగిన ఆ యువకుడిపై మహిళా ఎస్ఐ అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడటంతో పాటు, అందరి ముందే చేయి చేసుకున్నట్లు సమాచారం. పైగా, ఎదురు మాట్లాడితే తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తానని బెదిరించారు.
పోలీసుల ఈ అహంకారపూరిత ప్రవర్తనతో పూర్తిగా కుంగిపోయిన అంకిత్, తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు సోషల్ మీడియాలో కన్నీళ్లతో ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో పోలీసుల దౌర్జన్యాన్ని వివరిస్తూ, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని గుక్కపెట్టి ఏడ్చాడు.
అనంతరం, గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామంలోని 200 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్ చివరి వరకు ఎక్కి కూర్చున్నాడు. ఉదయాన్నే ఇది చూసిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీరుమున్నీరయ్యారు. “ఆ మహిళా సబ్-ఇన్స్పెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రజలందరి ముందు క్షమాపణ చెబితేనే కిందకు దిగుతాను” అని అంకిత్ భీష్మించుకుని కూర్చున్నాడు.
వర్షం, చలిని సైతం లెక్కచేయకుండా సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ నిరసనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న గాయ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ జయప్రకాష్ గుప్తా నేతృత్వంలోని పోలీసులు, ఎంతో శ్రమ మీద ఆ యువకుడితో చర్చలు జరిపి అతడిని సురక్షితంగా కిందకు దించారు.
ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓ సాధారణ సెల్‌ఫోన్‌ను తిరిగి పొందేందుకు కోర్టు ఉత్తర్వులు తీసుకెళ్లిన యువకుడికి ఎదురైన ఈ దుస్థితి, పోలీసుల దాష్టీకాన్ని మరోసారి కళ్లకు కట్టింది.

Leave a Reply