“నాకు ఇద్దరు భార్యలూ కావాలి.. ఇద్దరినీ కలిసే తీసుకెళ్తాను!”.. పట్టుబట్టిన కిలాడీ భర్త.. దిండిగల్ పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా..!!!

దిండిగల్ జిల్లా వడమదురై సమీపంలో, ఇద్దరు భార్యలను తనతోనే పంపించాలంటూ ఒక యువకుడు పోలీస్ స్టేషన్‌లోనే పట్టుబట్టిన వింత ఘటన తీవ్ర కలకలం రేపింది.

సెంగురిచ్చి ప్రాంతానికి చెందిన సడయాండి (28) అనే వెల్డింగ్ కార్మికుడికి ఇప్పటికే సుమతి అనే భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అతడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.

దీనిపై భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడమదురై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో, సడయాండి తనకు ఇప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, నాగేశ్వరి (21) అనే యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుని సంసారం సాగిస్తున్నట్లు అడ్డంగా దొరికిపోయాడు.

దీనిపై పోలీసులు ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఆ సమయంలో సడయాండి చాలా కూల్‌గా.. “నా మొదటి భార్య ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది, అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇద్దరూ ఇష్టమే, ఇద్దరు భార్యలను నాకైతేనే పంపించండి, నేను ఇద్దరినీ కలిపి ఒకే ఇంట్లో చూసుకుంటాను” అని చాలా క్యాజువల్‌గా చెప్పాడు. అది విన్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరోవైపు రెండో భార్య నాగేశ్వరి కూడా తాను సడయాండితోనే వెళ్తానని ఒంటికాలిపై లేవగా.. మొదటి భార్య సుమతి మాత్రం తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కోసం తన భర్తను తనతోనే పంపించాలంటూ కన్నీళ్లతో వేడుకుంది. చివరకు, మొదటి భార్య బతికుండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరమని పోలీసులు సడయాండికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇలాగే మొండికేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత రెండో భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె తల్లిదండ్రులతో పంపించివేయగా, సడయాండికి గట్టిగా బుద్ధి చెప్పి మొదటి భార్య, పిల్లలతో కలిసి పంపించివేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *