నాకు కేవలం 30 నిమిషాలు చాలు.. ఎదుటివారి క్యారెక్టర్ మొత్తం అర్థమైపోతుంది! “ఇషాన్ కిషన్‌లా మిమిక్రీ కూడా చేస్తా”.. సరదాగా చెప్పిన విరాట్ కోహ్లీ.. ఇదేంటి ఈ స్టార్ క్రికెటర్‌లో ఇలాంటి సీక్రెట్ టాలెంటా?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా కనిపిస్తాడో.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంతే సరదాగా, చలాకీగా ఉంటాడట. యువ ఆటగాళ్లతో కలిసి జోకులు వేసుకుంటూ, సరదాగా సమయం గడపడం తనకు ఇష్టమని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

జియోస్టార్ కోసం మాజీ భారత క్రికెటర్ అభినవ్ ముకుంద్తో జరిగిన ఇంటర్వ్యూలో కోహ్లీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

“వయసు పెరుగుతున్న కొద్దీ మీరు చాలా ప్రశాంతంగా, పరిణతితో కనిపిస్తున్నారు కదా?” అని అడగ్గా.. కోహ్లీ నవ్వుతూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

“కెమెరా ఆన్‌లో ఉంది కాబట్టే నేను అలా కనిపిస్తున్నాను” అంటూ సరదాగా చెప్పాడు.

అంతేకాదు.. డ్రెస్సింగ్ రూమ్‌లో తాను ఇప్పటికీ అదే చలాకీ వ్యక్తినేనని కోహ్లీ చెప్పాడు.

“ఎవరితోనైనా కేవలం 30 నిమిషాలు గడిపితే చాలు.. వారి ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని నేను చాలా బాగా గమనిస్తాను. ఆ తర్వాత వాళ్లలాగే మిమిక్రీ చేయగలను” అని కోహ్లీ సరదాగా వెల్లడించాడు.

ముఖ్యంగా ప్రస్తుత భారత జట్టులో ఇషాన్ కిషన్‌ను అద్భుతంగా మిమిక్రీ చేయగలనని నవ్వుతూ చెప్పాడు.

ఇక జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉండటంతో.. యువ క్రికెటర్లు తనతో ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడేలా సరదా వాతావరణాన్ని కల్పించడం కూడా తన బాధ్యత అని కోహ్లీ తెలిపాడు.

“చాలామంది యువ ఆటగాళ్లు మమ్మల్ని చూసే పెరిగారు. వాళ్లతో క్రికెట్ గురించి మాట్లాడటం ఒక విషయం.. కానీ వారితో సరదాగా నవ్వుతూ మాట్లాడటం వల్ల వాళ్లు మరింత సహజంగా ఉండగలుగుతారు. అయితే మైదానంలో మాత్రం 100 శాతం అంకితభావం, దూకుడులో ఎలాంటి తగ్గుదల ఉండదు” అని కోహ్లీ స్పష్టం చేశాడు.

మైదానంలో సీరియస్‌గా కనిపించే కోహ్లీలో ఇలాంటి సరదా కోణం ఉందని తెలియడంతో.. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *