పెళ్లయి నాలుగేళ్లు గడిచిన తర్వాత, ఘజియాబాద్కు చెందిన ప్రియ అనే వివాహిత అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
భర్త ఎన్నో చోట్ల గాలించినా భార్య ఆచూకీ దొరక్కపోవడంతో, చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తుండగా, ప్రియ తన ఆఫీసులో కలిసి పనిచేసే నీలమ్ అనే మహిళా సహోద్యోగితో కలిసి ప్రత్యేకంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకుని షాకైన భర్త, బంధువులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
గత ఆగస్టు 12న భర్తతో గొడవ జరగడంతో ప్రియ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రియ, నీలమ్ ఇద్దరూ ఒకే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో స్నేహితులుగా మారి, ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు విచారణలో వెల్లడైంది.
ఇరు కుటుంబాలు, పోలీసులు ఆ ఇద్దరు మహిళలకు నచ్చజెప్పి ఇంటికి రమ్మని కోరినప్పటికీ, తామిద్దరం కలిసే జీవించాలని అనుకుంటున్నామని, ఒకరినొకరు విడిచిపెట్టేది లేదని వారు ఖరాఖండిగా తేల్చిచెప్పారు.
తన భర్త ఎప్పుడూ గొడవపడుతూ సరిగ్గా చూసుకోకపోవడం వల్లే నీలమ్తో కలిసి ఉండటానికి మొగ్గు చూపుతున్నానని ప్రియ తెలిపింది. ఇరు కుటుంబాలు చేసిన సయోధ్య ప్రయత్నాలు విఫలం కావడంతో, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
