అమెరికాకు చెందిన అత్యంత ఆధునిక ఐదవ తరం సూపర్‌సోనిక్ స్టీల్త్ యుద్ధ విమానం ఎఫ్-35ను టర్కీకి విక్రయించడానికి అమెరికా ప్రణాళికలు రచిస్తోంది.
అయితే, టర్కీకి ఈ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను అందించడం వల్ల మధ్య ప్రాచ్య ప్రాంతంలోని అధికార సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపిన ఆయన, టర్కీ ఆక్రమణ ఆలోచనలతో ఉందంటూ హెచ్చరించారు.
ఇరాన్ వ్యవహారం గురించి మాట్లాడటానికి అమెరికా వెళ్లిన నెతన్యాహు అభ్యంతరానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖచ్చితమైన ముగింపు పలికారు. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ను దీనిపై ప్రశ్నించగా, “మేము ఎవరికి ఏమి అమ్మాలో ఎవరూ నాకు చెప్పలేరు” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, టర్కీ తమకు ఎంతో మంచి మిత్రదేశంగా విరాజిల్లుతోందని, సిరియా వ్యవహారం సహా అనేక ప్రాంతీయ సమస్యలలో టర్కీ భాగస్వామ్యం ప్రశంసనీయమైనదని ట్రంప్ కొనియాడారు.
టర్కీకి, ఇజ్రాయెల్‌కు మధ్య సౌహార్ద్రపూర్వక సంబంధాలు లేవనే విషయాన్ని అంగీకరించిన ట్రంప్, అయినప్పటికీ అమెరికా – టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో బలంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 2019లో ట్రంప్ మొదటి పాలనా కాలంలో, రష్యా నుండి ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను టర్కీ కొనుగోలు చేసినందున ఎఫ్-35 ప్రాజెక్ట్ నుండి దాన్ని సడన్‌గా తొలగించిన సంగతి గమనించదగ్గది.
అయినప్పటికీ, ఇటీవల జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ఎస్-400 కొనుగోలు వల్ల అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. దీని ద్వారా టర్కీకి మళ్లీ ఎఫ్-35 యుద్ధ విమానాలను అందించే అవకాశాలు పెరగడంతో, ఇజ్రాయెల్ తీవ్ర నిరసనను అధిగమించి ట్రంప్ ఈ ఆయుధ విక్రయాన్ని ముందుకు తీసుకెళ్లడం అంతర్జాతీయ రాజకీయాంగణంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.

Leave a Reply