సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక విచిత్రమైన పెళ్లి ప్రకటన (మ్యాట్రిమోనియల్ యాడ్) నెటిజన్లను, పెళ్లికాని ప్రసాదులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా మ్యాట్రిమోని ప్రకటనల్లో ప్రభుత్వ ఉద్యోగం, భారీ ప్యాకేజీ, మంచి కుటుంబ నేపథ్యం వంటివి ఆశిస్తారు. కానీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన రియా అనే యువతి.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి పెట్టిన వింత షరతులు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.
ఆ ప్రకటన ప్రకారం.. తనకు కాబోయే భర్తకు కెమెరా భయం అస్సలు ఉండకూడదని, భార్యతో కలిసి రీల్స్, వీడియోలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా, “మోయే-మోయే” లాంటి ట్రెండింగ్ పాటలకు సరిపోయే సరికొత్త వీడియో ఐడియాలను క్రియేట్ చేసే ప్రతిభ అతనికి ఉండాలట.
అంతటితో ఆగకుండా.. భర్తకు ‘ప్రీమియర్ ప్రో’ (Premiere Pro) వంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి వీడియోలు, వ్లాగ్‌లను ఎడిట్ చేయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలని కండిషన్ పెట్టింది. అలాగే, కాబోయే వరుడు ఉమ్మడి కుటుంబానికి చెందినవాడై ఉండకూడదని స్పష్టం చేసింది.
తనను సంప్రదించే ముందు, తనకు ఎలాంటి మగవారు నచ్చరో తెలుసుకోవడానికి ‘హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్’ అనే వెబ్ సిరీస్ చూడాలని కూడా ఆ యువతి సూచించింది. ఈ ప్రకటన స్క్రీన్‌షాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అవ్వడంతో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. “ఇది పెళ్లి ప్రకటన కాదు.. జీతం లేని ఉద్యోగ ప్రకటనలా ఉంది”, “ఈమెకు కావాల్సింది భర్తా లేక వీడియో ఎడిటరా?” అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply