ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చిన ఒక ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్‌ను.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు లైంగికంగా వేధించినట్లు వెలుగులోకి వచ్చిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
బాధితుడు విడుదల చేసిన వీడియో ఆధారాల్లో.. సదరు అధికారి ఆ యువకుడి వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాలని పదేపదే ఒత్తిడి చేయడం, “నాతో పాటు ఇంటికి వస్తావా?” అంటూ అసభ్యంగా మాట్లాడటం రికార్డయ్యాయి. తాను స్నేహితులతో ఉంటున్నానని, నంబర్ ఇవ్వడం కుదరదని యువకుడు తేల్చి చెప్పినప్పటికీ అధికారి వదలకుండా వేధించాడు.
తాను స్వలింగ సంపర్కుడిని (Gay) అని తెలుసుకున్న సదరు అధికారి.. కావాలనే తన పట్ల దురుద్దేశంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి పట్ల ప్రభుత్వ అధికారే ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సదరు అధికారిని తక్షణమే గుర్తించి కఠిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
