కోపం, గృహహింస అనేది ఏ పాపం ఎరుగని పసిబిడ్డ జీవితాన్ని ఏ విధంగా పూర్తిగా నాశనం చేస్తాయో చెప్పడానికి నిదర్శనంగా.. బీహార్లోని వైశాలి జిల్లాలో గుండెలు పిండేసే ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది.
“నాన్న కర్రతో కొట్టాడు… ఇప్పుడు అమ్మ పడుకుంది” అంటూ 5 ఏళ్ల బాలిక అన్షిక తన తల్లి మృతదేహం పక్కన కూర్చుని ఆడుకుంటూ అమాయకంగా చెప్పిన మాటలు, ఘటనా స్థలానికి వచ్చిన వారందరి హృదయాలను కలచివేశాయి.
ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, ఆవేశానికి లోనైన భర్త తన చేతికి దొరికిన కర్రతో భార్యను దారుణంగా కొట్టాడు. తల, శరీరంపై తీవ్ర గాయాలైన ఆ మహిళ రక్తపు మడుగులో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.
తాను చేసిన ఘోరాన్ని గ్రహించిన ఆ కిరాతక భర్త, రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను, ఏడుస్తున్న 5 ఏళ్ల కూతురిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. తల్లి శరీరం నుంచి రక్తం కారుతోందని, ఆమె చనిపోయిందని తెలియని ఆ పసిబిడ్డ.. అమ్మ నిద్రపోతోందని అనుకుని ఆమె పక్కనే ఆడుకుంటూ, అప్పుడప్పుడూ తల్లిని నిద్రలేపే ప్రయత్నం చేసింది.
ఇరుగుపొరుగు వారు అనుమానంతో ఇంట్లోకి వచ్చి చూడగా, మృతదేహం పక్కనే చిన్నారి అన్షిక ఆడుకుంటున్న హృదయవిదారక దృశ్యాన్ని చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న కర్కశ భర్త కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply