“నాన్న తెచ్చిన బిర్యానీ.. కూతురికి జరిగిన ఘోరం!” రెండో పెళ్లికి అడ్డు చెప్పిందని గొడవా? మిస్టరీ డెత్‌ను మలుపు తిప్పిన ఆ ఒక్క ఆధారం.!

ముంబైలో కన్న తండ్రే తన కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. భార్య మరణం తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న తండ్రి నిర్ణయాన్ని కూతుళ్లు వ్యతిరేకించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల యువతి రిఫత్ అనుమానాస్పద మృతి కాస్తా.. విచారణలో హత్య కేసుగా వెలుగుచూసింది.

ముంబైలోని వడాలా తూర్పు ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల షరీఫ్ రజా హుస్సేన్ ఖాన్ భార్య 2025 నవంబర్‌లో క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆ తర్వాత అతడు రెండో వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ, అతని పెద్ద కూతురు రిఫత్ (20), చిన్న కూతురు నుజత్ (16) దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తండ్రీకూతుళ్ల మధ్య నిత్యం వాగ్వాదాలు జరిగేవి. ఇదే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు విచారణలో గుర్తించారు.

అక్టోబర్ 2వ తేదీ రాత్రి, షరీఫ్ తన కూతుళ్ల కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు. అందులో విషం కలిపాడని, ఆ బిర్యానీ తిన్న తర్వాత రిఫత్‌ను గొంతు నులిమి చంపాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ రాత్రి ఉక్కపోతగా ఉండటంతో చిన్న కూతురు నుజత్ తన అత్త వాళ్ల ఇంటికి వెళ్లి పడుకోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. మరుసటి రోజు తెల్లవారుజామున రిఫత్ అపస్మారక స్థితిలో పడి ఉందని షరీఫ్ తన బంధువులకు నాటకమాడాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

మొదట ఫుడ్ పాయిజనింగ్ వల్లే రిఫత్ చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె మెడపై గొంతు నులిమిన ఆనవాళ్లు (ఒత్తిడి గుర్తులు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఒక్క ఆధారంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, తండ్రి షరీఫ్‌ను అరెస్టు చేశారు. బిర్యానీలో విషం కలిపారన్న ఆరోపణలతో పాటు పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *