వెస్ట్ బెంగాల్, ఉత్తర 24 పరగణాలు: ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఒక నాటక ప్రదర్శన (యాత్ర) చూడటానికి వెళ్లారు. తమ కూతురిని కూడా రమ్మని పదేపదే కోరారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ (హయ్యర్ సెకండరీ) పరీక్షల కోసం చదువుకోవాలని ఆ విద్యార్థిని ఇంట్లోనే ఉండిపోయింది. తీరా వారు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. ఈ విషాద ఘటన బసిర్హట్ పరిధిలోని హింగల్గంజ్, అంబెరియాలో చోటుచేసుకుంది.
ఘటన వివరాలు: మృతురాలిని దులదులి హైస్కూల్ విద్యార్థిని సీమా మండల్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు స్థానికంగా జరుగుతున్న ఒక కార్యక్రమానికి వెళ్లగా, సీమ ఇంట్లో ఒంటరిగా ఉంది.
అనుమానాస్పద స్థితిలో మృతి: పక్క గ్రామానికి చెందిన ఒక యువకుడితో సీమకు పరిచయం ఉందని తెలిసింది. ఆ యువకుడే మొదట గ్రామస్థులకు సీమ మరణవార్తను తెలిపాడు. తాను సీమ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిందని అతను పేర్కొన్నాడు. వెంటనే ఆమెను కిందకు దించి, తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు: ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ హింగల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
బాధిత తండ్రి కన్నీరుమున్నీరవుతూ ఇలా అన్నారు: “నా కూతురు పరీక్షలు బాగా రాస్తున్నానని చెప్పింది. నేను బయట ఉన్నప్పుడు ‘నాన్న, త్వరగా ఇంటికి రా’ అని పదేపదే మెసేజ్లు పంపింది. ఆ అబ్బాయితో సంబంధం గురించి నాకు తెలుసు.. 18 ఏళ్లు నిండాక పెళ్లి చేస్తానని కూడా చెప్పాను. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు.”
