ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కంపింపజేసే ఒక దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేహ వ్యాపారంలోకి బలవంతంగా నెట్టబడిన ఒక 16 ఏళ్ల మైనర్ బాలికను ఢిల్లీ పోలీసులు సురక్షితంగా విడిపించారు. నిందితుల బారి నుండి బయటపడిన తర్వాత ఆ చిన్నారి తాను అనుభవించిన నరకాన్ని, ఎదుర్కొన్న దారుణాలను పోలీసుల ముందు వివరించిన తీరు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మరీ ఘోరం!
బాలల హక్కుల కోసం పనిచేసే ‘అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్’ (AVA) అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ దాడి చేసి బాలికను రక్షించారు. ఏడాది క్రితం తనను ఈ చీకటి ప్రపంచంలోకి నెట్టారని, ప్రతిరోజూ రాత్రి వేళల్లో 8 నుండి 10 మంది కస్టమర్ల వద్దకు తనను బలవంతంగా పంపించేవారని ఆ బాలిక కన్నీరుమున్నీరైంది.
బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. తనకు తీవ్రమైన ఒళ్లు నొప్పులుగా ఉన్నాయని మొరపెట్టుకున్నా వినకుండా, నిందితులు ఆమెకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఇచ్చి మరీ పంపించేవారు. ఈ పని చేసినందుకు ఆమెకు కేవలం 500 రూపాయలు ఇస్తామని చెప్పేవారు, కానీ ఆ డబ్బులు కూడా ఎప్పుడో ఒకసారి అడిగితేనే ఇచ్చేవారు.
రహస్య వీడియోలతో బ్లాక్మెయిల్:
ఒకవేళ ఈ నరకం నుండి తనను వదిలేయమని ప్రాధేయపడితే, ఆ ముఠా సభ్యులు ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసిన వీడియోలను చూపిస్తూ.. ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నించినా లేదా ఎవరికైనా చెప్పినా వీటిని ఇంటర్నెట్లో పెడతామని తీవ్రంగా బెదిరించేవారు.
నమ్మించి మోసం చేసిన స్నేహితురాలు!
ఆ బాలికను నమ్మించి ఈ దారుణమైన కూపంలోకి నెట్టింది మరెవరో కాదు, ఆమె ప్రాణ స్నేహితురాలే. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ చిటికెలో తీర్చే ఒక వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పి ఆమెను తీసుకెళ్లింది.
“నా స్నేహితురాలు నన్ను ఒక అన్నయ్యకు పరిచయం చేసింది. అతను చాలా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించాడు. అప్పుడు నాకేం తెలియదు, నన్ను ఎలాంటి దారుణమైన దళదంలోకి నెడుతున్నారో ఊహించలేదు. కానీ ఒకసారి లోపలికి వెళ్ళాక అసలు విషయం తెలిసి బయటకు రావాలని చూశాను. కానీ వాళ్లు నన్ను రహస్య వీడియోలతో భయపెట్టి నోరు మూయించారు” అని బాధితురాలు పేర్కొంది.
కన్నతల్లి లేదు.. నాన్నకు ‘కాల్ సెంటర్’ అని అబద్ధం!
ఆ చిన్నారి తల్లి ఏడాది క్రితమే మరణించింది. ఆమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి ఉంటోంది, అయితే ఆయనకు విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉంది. ఈ విషయాలు మీ నాన్నకు తెలుసా? అని పోలీసులు ప్రశ్నించగా.. ఆమె లేదని తల ఊపింది.
“నాన్నకు ఏమీ తెలియదు. నేను రాత్రి షిఫ్ట్ ఉండే ఒక కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నానని ఆయనకు అబద్ధం చెప్పాను.”
“ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇల్లు వదిలి వెళ్లేదాన్ని, మళ్లీ ఉదయం 5 లేదా 6 గంటలకు ఇంటికి తిరిగొచ్చేదాన్ని.”
ఈ పనిలో ఆమెకు ఒక్కరోజు కూడా వీక్లీ ఆఫ్ (సెలవు) ఉండేది కాదు.
రంగంలోకి విజిలెన్స్ టీమ్.. ఎలా రక్షించారంటే?
‘AVA’ సంస్థ సీనియర్ డైరెక్టర్ మనీష్ శర్మ ఈ ఆపరేషన్ గురించి వివరించారు. “మా టీమ్ స్వయంగా విడతల వారీగా కస్టమర్ల లాగా నటిస్తూ ఆ ముఠాను సంప్రదించింది. వారి నమ్మకాన్ని గెలవడానికి మాకు నెల రోజులకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత డీల్ కుదుర్చుకుని ఆన్లైన్ పేమెంట్ చేశాం. వారు వెంటనే స్థావరాన్ని మార్చి మమ్మల్ని ద్వారక ప్రాంతానికి రమ్మన్నారు. మేము తక్షణమే పశ్చిమ ద్వారక రేంజ్ డీసీపీ అంకిత్ కుమార్ సింగ్‌కు సమాచారం అందించాం. ఆయన వెంటనే స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దించి దాడికి ప్లాన్ చేశారు.”
ఒక నిందితుడు అరెస్ట్.. వెనుక పెద్ద ముఠా!
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి అక్కడ ఖాళీ మద్య సీసాలు, పెయిన్ కిల్లర్ మందులు, యాంటీ బయాటిక్స్ మరియు లైంగిక వ్యాధుల నివారణకు వాడే మందులు లభించాయి. ఈ కేసులో ‘ఇబ్రహీం’ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను ఒక్కడినే కాదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని అతడు విచారణలో అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై పోక్సో (POCSO) చట్టం మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply