రాజస్థాన్ రాష్ట్రం టోంక్ జిల్లాలోని నగర్ గ్రామంలో, గత 2022 సెప్టెంబర్‌లో సుమన్ అనే యువతికి విషమిచ్చి దారుణంగా హత్య చేశారు.
ఈ కేసులో ప్రత్యేక ఎస్సీ-ఎస్టీ (SC-ST) న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జైపూర్‌లో నివసిస్తున్న సుమన్‌ను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసిన ప్రధాన్ అనే యువకుడు, 2022 సెప్టెంబర్ 11న ఆమెను నగర్ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 14న సుమన్‌ను పాము కుట్టిందని ఆమె కుటుంబ సభ్యులకు అబద్ధపు సమాచారం ఇచ్చాడు. కానీ, ఆసుపత్రికి వెళ్లేలోపే సుమన్ ప్రాణాలు కోల్పోయింది.
మొదట ఇది పాముకాటు వల్లే జరిగిన మరణమని నమ్మి అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ, సుమన్ అన్నయ్య బన్వారీ లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నివేదికలో సుమన్ పాముకాటుతో చనిపోలేదని, పురుగుల మందు (విషం) ఇచ్చి చంపారని నిర్ధారణ అయింది.
సుమన్ తన ప్రియుడు ప్రధాన్‌ను ఎంత గుడ్డిగా నమ్మిందంటే, తన బ్యాంక్ ఏటీఎం (ATM) కార్డు, దాని పిన్ నంబర్‌ను సైతం అతడికే ఇచ్చింది. అయితే, కులం కారణంగా ప్రధాన్, అతని తల్లి సంజనా దేవి, సోదరుడు సవాయిరామ్, సోదరి సుశీల కలిసి పథకం ప్రకారం సుమన్‌ను హత్య చేసినట్లు బట్టబయలైంది.
ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్తి మహేశ్వరి ఈ కేసును విచారించి, నిందితులైన 4 గురికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు, తలా ₹1.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తీర్పును వెలువరిస్తున్న సమయంలో జడ్జి ఆర్తి మహేశ్వరి రాసిన భావోద్వేగభరితమైన కవితా పంక్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి.
“అది కొన్నేళ్ల బంధం, అదొక నమ్మకాల ప్రపంచం… తన మరణానికి కుట్ర పన్నుతున్నారని ఆ అమాయకురాలికి తెలియదు! కులం పేరుతో ప్రేమకు విషపు పాత్రను అందించారు… జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన వాడే ప్రాణాలు తీశాడు! తల్లి, సోదరుడు, సోదరితో కలిసి మానవత్వాన్ని తలదించుకునేలా చేశాడు… ప్రియురాలి పవిత్రమైన నమ్మకాన్ని దారుణంగా హత్య చేశాడు! విసెరా (శరీర భాగాల పరీక్ష)లో విషం, ఏటీఎం కార్డు సాక్ష్యం… సత్యాన్ని ఎంతకాలం దాచగలరు? న్యాయదేవత కలం నేరస్థులకు వారి కర్మానుసారం శిక్షను అందిస్తుంది! ప్రేమ నేరం కాదు, కానీ నమ్మకద్రోహం క్షమించరానిది… న్యాయం ఇచ్చే సందేశం ఇదే – అమాయకురాలి రక్తం వృధా పోదు!”
న్యాయమూర్తి ఆర్తి మహేశ్వరి కవితా రూపంలో ఇచ్చిన ఈ భావోద్వేగభరిత తీర్పు, న్యాయస్థానాల చరిత్రలో న్యాయం గొంతుకను బలంగా వినిపించింది.

Leave a Reply