ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్, అపారమైన సంపదకు వారసుడైనప్పటికీ, మరణించే సమయానికి 450 మిలియన్ డాలర్ల (సుమారు ₹3,758 కోట్లు) అప్పుల్లో ఉండటం ఒక పెద్ద విరోధాభాసం.
ప్రపంచాన్ని తన పాటలతో, డ్యాన్స్‌తో ఊపేసిన ఆ అద్భుత కళాకారుడు తన సంపదను కాపాడుకోలేకపోయారు. ఆయన మరణానికి రెండేళ్ల ముందు, 2007లో లాస్ వెగాస్‌లోని ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళ్ళిన జాక్సన్, కేవలం ఒక్క నిమిషంలోనే 5 మిలియన్ డాలర్లు (సుమారు ₹42 కోట్లు) ఖర్చు చేశారు. అది కూడా ఆస్తుల మీదో, బిజినెస్ మీదో కాదు.. కేవలం అరుదైన ఫర్నిచర్ మరియు శిల్పాల కోసం! మైఖేల్ జాక్సన్ జీవితంలో డబ్బు నదిలా ప్రవహించి, వర్షంలా మాయమైపోయేదని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఆస్తులు ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి:
2009 జూన్ 25న మరణించే సమయానికి జాక్సన్‌కు 450 మిలియన్ డాలర్ల అప్పు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడైన రికార్డు, ఎన్నో గిన్నెస్ రికార్డులు ఉన్నా.. ఆర్థికంగా ఆయన కుప్పకూలిపోయారు. “ఆస్తులు కోట్లలో ఉన్నా, చేతిలో నగదు లేని పరిస్థితి” అని ఆర్థిక నిపుణులు దీనిని వర్ణించారు. బ్యాంకులు, అప్పుల వారు ఆయనను చుట్టుముట్టారు.
సాధారణ స్థితి నుండి ప్రపంచ స్థాయికి:
ఇండియానాలోని గ్యారీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో తొమ్మిది మంది పిల్లల్లో ఏడవ వ్యక్తిగా మైఖేల్ జన్మించారు. రెండు గదుల చిన్న ఇంట్లో నివసించేవారు. తండ్రి జోసెఫ్ జాక్సన్ పిల్లలను కళారంగంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించారు. ఫలితంగా ‘జాక్సన్ 5’ గ్రూప్ ద్వారా మైఖేల్ ప్రపంచ ప్రసిద్ధి చెందారు. 1982లో వచ్చిన ‘Thriller’ ఆల్బమ్ ఆయనను గ్లోబల్ ఐకాన్‌గా మార్చింది.
నెవర్‌ల్యాండ్ రాంచ్ – ఒక కలల ప్రపంచం:
1988లో కాలిఫోర్నియాలో 2,700 ఎకరాల విస్తీర్ణంలో ‘నెవర్‌ల్యాండ్ రాంచ్’ అనే ఎస్టేట్‌ను సుమారు 19.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అది కేవలం ఇల్లు కాదు, ఒక వినోద ప్రపంచం. అందులో అమ్యూజ్మెంట్ పార్క్, జంతు ప్రదర్శనశాల, సినిమా థియేటర్ కూడా ఉన్నాయి. దీనిని నిర్వహించడానికే ఏడాదికి 5 మిలియన్ డాలర్లు ఖర్చయ్యేది. ఆదాయం ఉన్నా లేకపోయినా ఈ ఖర్చు తప్పనిసరి అయ్యేది.
పతనం ఎక్కడ మొదలైంది?
ఫోర్బ్స్ విశ్లేషణ ప్రకారం, 2000వ దశకం నాటికి జాక్సన్ తన ఆదాయం కంటే ఏడాదికి 20 నుండి 30 మిలియన్ డాలర్లు అదనంగా ఖర్చు చేసేవారు. అరుదైన కళాఖండాలు, నగలు, ప్రైవేట్ జెట్ ప్రయాణాల కోసం భారీగా వెచ్చించేవారు. దీనికి తోడు 2005లో జరిగిన కోర్టు కేసులు ఆయన ప్రతిష్టను, ఆర్థిక స్థితిని దెబ్బతీశాయి. న్యాయపోరాటం కోసం మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చయింది. 50 ఏళ్ల వయసులో ఆయన మరణించే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 65కు పైగా క్లెయిమ్‌లు ఆయనపై ఉన్నాయి.
మరణం తర్వాత మారిన పరిస్థితి:
మైఖేల్ మరణం తర్వాత ఆయన ఎస్టేట్ మేనేజర్లు కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించారు. 2016లో సోనీ కంపెనీలో ఆయనకున్న వాటాలను 750 మిలియన్ డాలర్లకు విక్రయించి అప్పులన్నీ తీర్చేశారు. 2024 నాటికి మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ విలువ 3.5 బిలియన్ డాలర్లకు (సుమారు ₹29,000 కోట్లు) పైగా చేరింది.
