ఇరాన్లో జనవరి నెలలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో కవల సోదరీమణులకు కఠిన శిక్షలు విధించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఇస్ఫహాన్ (Isfahan) నగరానికి చెందిన తారానేహ్ (Taraneh), రొమినా రహీమీ (Romina Rahimi) అనే సోదరీమణులు నిరసనల్లో పాల్గొన్న కొన్ని రోజుల తర్వాత అరెస్టు అయినట్లు సమాచారం వెలువడింది. ఆ సమయంలో వారిద్దరి వయస్సు 19 ఏళ్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం తారానేహ్కు మరణశిక్ష, రొమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
జనవరి నెలలో ఇస్ఫహాన్‌లోని షోహదా స్క్వేర్ ప్రాంతంలో నిరసనలు జరిగినప్పుడు వీరిద్దరూ అందులో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ కవల సోదరీమణులతో సహా 16 మందిని అరెస్టు చేశారు. వారిపై భద్రతా బలగాలపై దాడి చేశారని, మొలోటోవ్ కాక్టెయిల్స్ (పెట్రోల్ బాంబులు) తయారు చేశారనే వాటితో పాటు పలు ఆరోపణలు మోపారు. అంతేకాకుండా, ఇరాన్ చట్టం ప్రకారం మరణశిక్షకు దారితీసే “మొహరేబెహ్” (Moharebeh – దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం) అనే తీవ్రమైన అభియోగాన్ని కూడా వారిపై మోపినట్లు సమాచారం.
అరెస్టు చేసిన తర్వాత ఇద్దరినీ వేర్వేరు జైలు గదుల్లో నిర్బంధించారని, తీవ్రంగా హింసించారని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆరోపించారు. మే నెలలో తల్లి తన కుమార్తెలను కలిసినప్పుడు, వారి ముఖాలు వాచిపోయి ఉన్నాయని, శరీరంపై గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు నెలల పాటు కుమార్తెలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియక వారి తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లిపోయినట్లు సమాచారం వెలువడింది. ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యుల తరఫు వారే వెల్లడించారు.
తారానేహ్కు విధించిన మరణశిక్షను నిలిపివేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు అప్పీల్ చేశారు. అలాగే, బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాదుల ద్వారా ఐక్యరాజ్యసమితి (UN) సహాయాన్ని కూడా కోరారు. జైలులో ఆ సోదరీమణులు ఎదుర్కొన్నట్లు చెబుతున్న వేధింపులు, కేసు విచారణ తీరుపై కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్ஷించింది.

Leave a Reply