న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఓ పని అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వివాదానికి, విమర్శలకు దారితీసింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన న్యాయమైన ప్రశ్నకు సమాధానం చెప్పలేక, ఆమె దుస్తులను చూపిస్తూ గొంతు కోస్తారన్నట్లుగా సైగ చేసి బెదిరించిన పాక్ మంత్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.
న్యూయార్క్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ను కలిసిన ఓ ఆఫ్ఘన్ మహిళా రిపోర్టర్.. ‘తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘన్ మహిళల హక్కులను కాలరాస్తుండటంపై పాకిస్థాన్ వైఖరి ఏమిటి? తాలిబాన్ల ఈ క్రూరమైన విధానాలను మార్చుకోవాలని పాకిస్థాన్ ఒత్తిడి తెస్తుందా? మొదటి నుంచీ తాలిబాన్లను తమ మిత్రులుగా భావిస్తున్న పాకిస్థాన్, మహిళలకు వ్యతిరేకంగా వారు తీసుకుంటున్న చర్యలను ఎందుకు వ్యతిరేకించడం లేదు?’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
మహిళా రిపోర్టర్ అడిగిన ఈ ప్రశ్నలకు ఖంగుతిన్న మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆమె మాటలను మధ్యలోనే అడ్డుకున్నారు. అనంతరం ఆ మహిళ ధరించిన దుస్తులను తేరిపార చూస్తూ, వాటిని వేలెత్తి చూపించిన మంత్రి.. ‘ఈ దుస్తులతో మీరు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వెళ్లకండి’ అని వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా, తన చేతిని మెడ దగ్గరకు తీసుకెళ్లి ‘గొంతు కోసేస్తారు’ అన్నట్లుగా అత్యంత దారుణమైన రీతిలో సైగ చేశారు. అది చూసి మంత్రి చుట్టూ ఉన్న పాకిస్థాన్ ప్రతినిధులు, ఇతర పురుషులు గట్టిగా పగలబడి నవ్వారు. ఒక దేశానికి చెందిన సీనియర్ మంత్రి, ఓ మహిళా జర్నలిస్టుకు చావును గుర్తుచేస్తూ బెదిరించడం, చుట్టూ ఉన్నవారు దాన్ని చూసి ఎగతాళిగా నవ్వడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు పాకిస్థాన్ మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ మహిళ అడిగిన తీవ్రమైన ప్రశ్నకు సీనియర్ మంత్రి ఇలా సమాధానం ఇవ్వడం అత్యంత సిగ్గుచేటు. ఒక మహిళను చంపేస్తారంటూ సైగలు చేసి బెదిరించడం హాస్యమో లేదా దౌత్యమో కాదు. తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘన్ మహిళలు పడుతున్న కష్టాల గురించి మాట్లాడటానికి వచ్చిన మహిళకు బెదిరింపులు, ఎగతాళి నవ్వులు కాదు.. సరైన సమాధానం దక్కాల్సింది’ అంటూ పలువురు మండిపడుతున్నారు.

Leave a Reply