అమెరికాకు చెందిన ఒక హిందూ పూజారి (పండితుడు), కెనడాలో ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి కెనడా పోలీసుల చేతిలో అరెస్టయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహావేశాలను కలిగించింది.
కెనడాలోని అంటారియో ప్రావిన్స్, ఓషవా ప్రాంతంలో నివసిస్తున్న ఒక కుటుంబం.. తమ ఇంట్లో ప్రత్యేక పూజలు, దోష నివారణ పరిహారాలు చేయించేందుకు అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన రాజేంద్రనాథ్ దూత్‌నాథ్ మహరాజ్ (50) అనే పూజారిని పిలిపించింది.
పూజలు చేసేందుకు వచ్చిన ఆ పూజారి తన ఆధ్యాత్మిక హోదాను దుర్వినియోగం చేస్తూ, ఆ కుటుంబానికి చెందిన యువతిని మోసం చేయడం ప్రారంభించాడు. ఆ యువతికి “దుష్ట శక్తులు, దెయ్యం పట్టాయని.. వాటిని వదిలించి నయం చేయాలంటే ఏకాంతంగా ప్రత్యేక పరిహార పూజ చేయాల్సి ఉంటుందని” చెప్పి వారిని నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు ఆ యువతిని పూజారితో పంపేందుకు అంగీకరించారు.
ఆ తర్వాత, ఆ యువతిని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన పూజారి.. పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై దారుణంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. డర్హామ్ రీజినల్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడైన పూజారి రాజేంద్రనాథ్ దూత్‌నాథ్ మహరాజ్‌ను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన పూజారిపై లైంగిక దాడి చట్టాల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడు అమెరికా, కెనడాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక పూజలు నిర్వహించేవాడు కాబట్టి.. ఇంకా ఎవరైనా మహిళలు ఇతని చేతిలో బాధితులుగా మారారా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ నిందితుడి గురించి గానీ, ఇలాంటి మోసాల గురించి గానీ ఏవైనా వివరాలు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Leave a Reply