బ్రెజిల్‌లోని అగ్వాస్ లిండాస్ డి గోయాస్ (Águas Lindas de Goiás) నగరంలో, తన మాజీ భర్త చేతిలో కిడ్నాప్‌కు గురై రోజుల తరబడి దారుణ చిత్రహింసలను అనుభవించిన 24 ఏళ్ల యువతిని పోలీసులు సాహసోపేతంగా రక్షించారు.
ఎమిలియానె తమారా నూన్స్ కార్వాలో అనే ఆ యువతి ఆగస్టు 17న అదృశ్యమవగా, ఐదు రోజుల తర్వాత ఒక పాడుబడిన ఇంట్లో నుంచి ఆమెను పోలీసులు కాపాడారు. ఆమె ఆర్తనాదాలు విన్న మిలిటరీ పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా.. ఆమె ముఖానికి గ్యాస్ మాస్క్ తొడిగి, చేతులు-కాళ్లను గొలుసులతో మంచానికి కట్టేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
నర్సింగ్ వృత్తిలో ఉన్న ఎమిలియానె.. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు తన మాజీ భర్త అయిన ఐల్టన్ రోడ్రిగ్స్ డి సౌజాను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆమెపై దాడి చేసి రహస్య గదిలో బంధించిన ఐల్టన్.. నిరంతరం మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు ఆమెను రక్షించే సమయానికి శ్వాస ఆడక, ఆక్సిజన్ అందక ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అంతేకాకుండా, ఆ ఇంట్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గమనిస్తే.. ఆమెను ఇంకా అనేక రోజుల పాటు అక్కడే బంధించి ఉంచాలని ఆ నిందితుడు పథకం వేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బట్టబయలైంది.
ఈ ఘటన అనంతరం ఆగస్టు 21న నిందితుడైన ఐల్టన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. కిడ్నాప్, అత్యాచారం, అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎమిలియానె ప్రస్తుతం కోలుకుని ఇంటికి చేరుకుంది. దాదాపు ఐదేళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట 2025 డిసెంబర్‌లో విడిపోయారు. చిన్న వయసులోనే పెళ్లి జరగడంతో తమ మధ్య ఉన్న బంధం నిజమైన ప్రేమో లేక కేవలం ఆకర్షణో కూడా తనకు అర్థం కాలేదని ఎమిలియానె గతంలో పేర్కొనడం గమనార్హం.

Leave a Reply