నీలన్‌కరైలోని తన ఇంట్లో విజయ్ ఒక చెట్టు కొమ్మను పట్టుకుని నిచ్చెన సహాయంతో ప్రహరీ గోడను ఎక్కాడు.

చెన్నై: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోలీవుడ్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. చెన్నై నీలాంగరిలోని తన నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులను పలకరించేందుకు విజయ్ ఏకంగా ఇంటి గోడ ఎక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అభిమానుల కోసం సాహసం!

సాధారణంగా పండుగ రోజుల్లో రజనీకాంత్ వంటి అగ్ర హీరోలు తమ ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడం ఆనవాయితీ. అయితే విజయ్ ఇంటి కాంపౌండ్ వాల్ దాదాపు 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటంతో, బయట ఉన్న వారికి ఆయన కనిపించడం కష్టమైంది. దీనితో విజయ్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లోపలి వైపు నుండి గోడకు నిచ్చెన వేసి పైకి ఎక్కారు. అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మను పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ, అభిమానుల వైపు చూస్తూ ఉత్సాహంగా చేతులు ఊపారు.

భద్రతపై ఆందోళన.. విమర్శల వెల్లువ!

విజయ్ తన అభిమానుల కోసం గోడ ఎక్కడం ఒకవైపు వారిని ఖుషీ చేసినా, మరోవైపు విమర్శలకు కూడా దారితీస్తోంది.

  • రిస్క్ ఎందుకు?: ఇప్పటికే అభిమానులు విజయ్‌ని చూసే క్రమంలో చెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, బ్యానర్ల పైకి ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నాయకుడే ఇలా గోడలు ఎక్కితే, కార్యకర్తలు కూడా అదే బాటలో ప్రమాదకర స్టంట్లు చేసే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • బౌన్సర్ల రక్షణ ఎవరికి?: అభిమానులను అదుపు చేసే నెపంతో వారి చేతులు, కాళ్లపై బూట్లతో తొక్కేంత స్థాయిలో బౌన్సర్లను ఉంచుకునే విజయ్.. నేరుగా బయటకు వచ్చి అభిమానులను పలకరించవచ్చు కదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గోడ ఎక్కి చూడటం అంటే అభిమానులంటే ఏదో అలర్జీ ఉన్నట్లు వ్యవహరించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

అనంతరం విజయ్ అక్కడి నుండి నేరుగా కారులో విమానాశ్రయానికి వెళ్లి, అటు నుండి అవినాశిలో తన ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఏది ఏమైనా, తన అభిమానుల కోసం విజయ్ చేసిన ఈ ‘వాల్ క్లైంబింగ్’ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.


Posted

in

by

Tags: