ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా కొన్ని సెకన్లలోనే అచ్చం నిజమైనవిగా అనిపించే ఫోటోలను సృష్టించడం సాధ్యమవుతుంది. అయితే, దానిని బాధ్యతారాహిత్యంగా ఉపయోగిస్తే ఎలాంటి చట్టపరమైన చిక్కులు వస్తాయో చెప్పడానికి సింగపూర్‌లో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ.
పాండన్ రిజర్వాయర్‌లో మొసలి ఉన్నట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన ఓ ఫోటోను షేర్ చేసిన 30 ఏళ్ల మయన్మార్ జాతీయుడు ‘యే లిన్’పై పోలీసులు రెండు అభియోగాలు నమోదు చేశారు.
ఆగస్టు 20న యే లిన్.. ఏఐ యాప్‌ను ఉపయోగించి పాండన్ రిజర్వాయర్‌లో ఓ ప్రమాదకరమైన మొసలి ఉన్నట్లుగా ఓ ఫోటోను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ ఫోటోను తన సహోద్యోగికి పంపాడు. ఈ సమాచారం అధికారుల దృష్టికి వెళ్లడంతో, జాతీయ జల వనరుల సంస్థ (PUB) మరియు నేషనల్ పార్క్స్ బోర్డు సంయుక్తంగా ఆ ప్రాంతంలో మొసలి ఉందనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాయి.
మొసలి ఉన్నట్లు నిర్ధారణ కాకపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా రిజర్వాయర్‌లో జరిగే నీటి సంబంధిత కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. రోయింగ్, బోటింగ్ క్రీడా సంస్థలకు కూడా సమాచారం అందించారు. ఆ ఫోటో ఏఐ ద్వారా సృష్టించబడిందా అని తెలుసుకోవడానికి పలు టూల్స్ ద్వారా పరీక్షించినప్పటికీ, మొదట్లో వారికి స్పష్టమైన ఆధారం లభించలేదు. ఆ తర్వాత ఆ ఫోటో ఫేక్ (నకిలీ) అని తేలడంతో గాలింపు చర్యలు నిలిపివేసి, వాటర్ యాక్టివిటీస్‌ను మళ్లీ ప్రారంభించారు.
ఇదిలా ఉంటే, ఆగస్టు 21న యే లిన్ తన మొబైల్ ఫోన్లో ఉన్న ఆ ఫోటోతో పాటు, దాన్ని సృష్టించడానికి ఉపయోగించిన ఏఐ యాప్ డేటాను (హిస్టరీని) కూడా తొలగించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో తప్పుడు సమాచారం పంపడం, దర్యాప్తునకు ఆటంకం కలిగించడం అనే రెండు అభియోగాలను అతనిపై నమోదు చేశారు. తప్పుడు సమాచారం పంపిన నేరానికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది; అలాగే దర్యాప్తును తప్పుదోవ పట్టించిన నేరానికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. నిందితుడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించబోతున్నట్లు తెలుస్తోంది; ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 10న జరగనుంది.

Leave a Reply