“నువ్వు ఎత్తుగా ఎగరగలవా? వాలీబాల్ వద్దు, ఫుట్‌బాల్ చాలు”; చిన్నారితో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఒక చిన్నారి మధ్య ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.

మిషెల్ ఒబామా ప్రారంభించిన క్రీడా పథకానికి బదులుగా, ‘ప్రెసిడెన్షియల్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్’ను పునఃప్రారంభించే కార్యక్రమం సందర్భంగా ఈ వైరల్ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక చిన్నారిని ఆమెకు ఏ క్రీడలంటే ఇష్టమని ట్రంప్ ఆరా తీశారు.

తాను వాలీబాల్ ఆడతానని, రాబోయే వేసవిలో ఫుట్‌బాల్ ఆడాలని అనుకుంటున్నట్లు ఆ చిన్నారి సమాధానమిచ్చింది. అయితే, ఆ అమ్మాయి ఎత్తును ఉద్దేశించి మాట్లాడుతూ.. వాలీబాల్‌లో బాగా స్మాష్ చేయగలవా? ఎత్తుగా ఎగరగలవా? అని ట్రంప్ ప్రశ్నించారు.

తాను అంత ఎత్తుగా ఎగరలేనని ఆ చిన్నారి స్పష్టం చేయడంతో.. వాలీబాల్ కంటే నీకు ఫుట్‌బాల్ ఆడటమే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి ఈ సమాధానం నిమిషాల్లోనే సైబర్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక చిన్నారితో అంత కఠినంగా మాట్లాడటం, ఆమె ఆత్మవిశ్యాసాన్ని దెబ్బతీయడం సరైనది కాదని ఒక వర్గం విమర్శిస్తుంటే.. ఆయన కేవలం ఆచరణాత్మకమైన సలహా మాత్రమే ఇచ్చారని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే, ఈ సంభాషణ అంతటా ఆ చిన్నారి చాలా ప్రశాంతంగా, గౌరవంగా సమాధానమివ్వడం గమనార్హం.

అదే కార్యక్రమంలో వెయిట్‌లిఫ్టింగ్ అంటే ఆసక్తి ఉన్న మరో చిన్నారితో మాట్లాడుతూ.. మహిళా క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడంపై తన రాజకీయ అభిప్రాయాలను కూడా ట్రంప్ పంచుకున్నారు. ఇది కూడా వీడియో వైరల్ అవ్వడానికి కారణమైంది.

ట్రంప్ మాటల్లో ఉన్నది తమాషానా లేక అనవసరమైన ఎగతాళినా అనే విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Posted

in

by

Tags: