“నేను కాఫీ కోసం చస్తున్నాను..”: తన మరణ వార్తలపై నెతన్యాహు సెటైర్లు!

తన మరణం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెడుతూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ‘X’ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఇరాన్ జరిపిన దాడిలో ఆయన మరణించారంటూ వైరల్ అవుతున్న కుట్రపూరిత వార్తలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

ఆ వీడియోలో నెతన్యాహు ఒక కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ కనిపించారు. తన మరణ వార్తలపై జోకులు వేస్తూ.. “నేను చస్తున్నాను.. కాఫీ కోసం (I am dead… for coffee)” అని హీబ్రూ భాషలోని ఒక సామెతను వాడారు. ఏదైనా వస్తువు లేదా పని అంటే అమితమైన ఇష్టం ఉన్నప్పుడు అక్కడ ఇలాంటి పదాన్ని వాడుతుంటారు. “అంతేకాదు, నా దేశ ప్రజల కోసం కూడా నేను చావడానికైనా సిద్ధమే. వారు చూపిస్తున్న తెగువ అద్భుతం” అని ఆయన కొనియాడారు.

ఆరు వేల పుకార్లకు చెక్: గత గురువారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని, అది AI (కృత్రిమ మేధ) ద్వారా సృష్టించబడిన ఫేక్ వీడియో అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూ, నెతన్యాహు వీడియోలో తన రెండు చేతులను కెమెరాకు చూపిస్తూ.. “నా వేళ్లు లెక్కపెడతారా? ఇక్కడ చూడండి.. అలాగే ఇక్కడ కూడా. చూశారా? అన్నీ బాగున్నాయి కదా” అని ఎద్దేవా చేశారు.

ప్రజలకు సందేశం: ఇజ్రాయెల్ పౌరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి, కానీ రక్షణ కవచాలకు (Protected spaces) దగ్గరగా ఉండండి. మీ ధైర్యం నాకు, ప్రభుత్వానికి, సైన్యానికి (IDF) మరియు మొసాద్‌కు ఎంతో శక్తినిస్తోంది. మేము ఇరాన్‌పై గట్టి దాడులు చేస్తున్నాం. నన్ను ఇలాగే ముందుకు సాగమంటారా? అయితే మీరు కూడా అలాగే ధైర్యంగా ఉండండి” అని పిలుపునిచ్చారు. హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.

మరోవైపు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన చేస్తూ నెతన్యాహును వదిలిపెట్టబోమని, ఆయనను వేటాడి చంపుతామని హెచ్చరించాయి. గత నెలలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారన్న వార్తల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.


Posted

in

by

Tags: