సోషల్ మీడియాలో తన మరణం గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు సోమవారం మరో వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన ప్రజలతో ముచ్చటిస్తూ కనిపించారు. అంతకుముందు కూడా ఆయన కాఫీ తాగుతూ, తన చేతి ఐదు వేళ్లను చూపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
నెతన్యాహు క్షేమం: రాయబారి ధృవీకరణ నెతన్యాహు ఆరోగ్యంపై వస్తున్న వైరల్ వార్తలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ కొట్టిపారేశారు. ప్రధాని నెతన్యాహు ప్రాణాలతోనే ఉన్నారని, ఆయనకు సంబంధించిన తాజా వీడియోలు నిజమైనవేనని స్పష్టం చేశారు. “నేను స్వయంగా ఆయనను ఇజ్రాయెల్‌లో చూశాను. కేఫ్‌లో ఆయన కాఫీ తాగుతున్న వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించింది కాదు. సోషల్ మీడియాలో చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
‘ఆరు వేళ్ల’ పుకార్లపై వివరణ: నెతన్యాహు హత్యకు గురయ్యారని ఇరాన్ సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేయడంతో ఈ వివాదం మొదలైంది. శుక్రవారం ఆయన ప్రసంగించిన ఒక వీడియోలో, కుడి చేతి చిటికెన వేలు వద్ద అదనపు మాంసం కనిపిస్తోందని, అది ‘AI గ్లిచ్’ (సాంకేతిక లోపం) అని నెటిజన్లు ఆరోపించారు. నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్లు ఆ వీడియో చూపిస్తోందని, కాబట్టి అది నకిలీ వీడియో అని వారు వాదించారు. దీనిని తిప్పికొడుతూ నెతన్యాహు ఆదివారం తన ఐదు వేళ్లను స్పష్టంగా చూపిస్తూ మరో వీడియో తీశారు.
ప్రధాని కార్యాలయం స్పందన: “ప్రధాని నెతన్యాహు క్షేమంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ నకిలీ వార్తలు (Fake News)” అని ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
