మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా పంచాయతీ సమితి (మండల పరిషత్) కార్యాలయంలో రుణాల మంజూరుకు సంబంధించి తీవ్ర కలకలం రేగింది.
మహారాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ ‘ఉమేద్’ (Umeed) పథకం కింద స్వయం సహాయక సంఘాలకు (SHG) అందించే నిధులు, రుణాల మంజూరు ప్రక్రియపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పథకంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (CRP)గా పనిచేస్తున్న అనితా సంజయ్ కవతాడే తనకు రుణం మంజూరు చేసేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో లంచం ఇవ్వలేకపోయానని, అర్హత ఉన్నప్పటికీ డబ్బు ఇవ్వనందుకే రుణం నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనిత తెలిపిన వివరాల ప్రకారం.. రుణానికి అవసరమైన అన్ని అర్హతలు తనకున్నప్పటికీ, ముడుపులు చెల్లించనందుకే దరఖాస్తును తిరస్కరించారు. స్వయం సహాయక సంఘాల్లోని కొందరు మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి రుణాలు మంజూరు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో సరైన పత్రాలు లేకపోయినా ముడుపులు ఇచ్చిన వారికి రుణాలు ఇచ్చారని, నిజమైన అర్హత ఉన్న పేద మహిళలు మాత్రం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆమె పేర్కొన్నారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిత నేరుగా పంచాయతీ సమితి కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. ఆ సమయంలో అక్కడున్న ఇతర మహిళల ముందే ఆమె ఈ అక్రమాలను బట్టబయలు చేశారు. “నేను నిరుపేదను.. లంచాలు ఇచ్చే స్తోమత నాకు లేదు” అంటూ ఆమె నినదించడంతో కార్యాలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది.
అర్హులైన నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకంలో లంచాలు డిమాండ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply