ఖట్మండు:
అయినవారికో, ఆశ్రితులకో పదవులు ఇచ్చుకోవడం రాజకీయాల్లో కామన్. కానీ, నేపాల్‌లో తాజాగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం ప్రపంచ దేశాలకే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. కేవలం 35 ఏళ్ల వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన బాలేంద్ర షా నేతృత్వంలోని కేబినెట్ చూస్తుంటే.. “చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ ఎలా మారుతుందో” అర్థమవుతోంది. వీరి క్వాలిఫికేషన్స్ చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.
బెంగళూరు చదువు.. నేపాల్ బాధ్యత!
నేపాల్ 47వ ప్రధాని బాలేంద్ర షాకు మన భారతదేశంతో, ముఖ్యంగా బెంగళూరుతో విడదీయలేని సంబంధం ఉంది. ఆయన బెంగళూరులోని నిట్టే మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ (NMIT) నుండి 2018లో ఎంటెక్ (స్ట్రక్చరల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు. ఒకప్పుడు ర్యాపర్‌గా గుర్తింపు పొందిన బాలేంద్ర, ఇప్పుడు దేశ భవిష్యత్తును మలుస్తున్నారు.
కేబినెట్ కాదు.. ఇది ఒక యూనివర్సిటీ!
బాలేంద్ర షా బృందంలో ఉన్న మంత్రుల విద్యా అర్హతలు గమనిస్తే ఏ దేశానికీ తీసిపోరు:
ఆర్థిక మంత్రి (డా. స్వామిమ్ వాగ్లే – 52): హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ కేబినెట్‌లో ఈయనే అత్యంత సీనియర్.
విదేశాంగ మంత్రి (శిశిర్ ఖానల్ – 47): అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ చేశారు.
న్యాయశాఖ మంత్రి (శోభితా గౌతమ్ – 31): బీఏ, ఎల్ఎల్బీతో పాటు పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు.
కార్మిక మంత్రి (రామ్జీ యాదవ్ – 31): మన ఐఐటీ మద్రాస్ (IIT Madras) నుండి ఎంటెక్ పట్టా పొందారు.
ఆరోగ్య మంత్రి (నిషా మెహతా – 36): హెల్త్ పాలసీ మరియు పబ్లిక్ హెల్త్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు.
తప్పు చేస్తే ‘తెలదండం’.. అవినీతిపై ఉక్కుపాదం!
పదవి ఇచ్చింది పనిచేయడానికే కానీ, పవర్ చూపించడానికి కాదని ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు. తన పదవిని అడ్డం పెట్టుకుని భార్యకు ఉద్యోగం ఇప్పించారనే ఆరోపణపై కార్మిక మంత్రి దీపక్ కుమార్‌ను కేవలం 15 రోజుల్లోనే (ఏప్రిల్ 10న) కేబినెట్ నుండి బర్తరఫ్ చేశారు. స్వంత పార్టీ వారైనా సరే, అవినీతిని సహించబోనని బాలేంద్ర ఇచ్చిన ఈ సంకేతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది.
జర్నలిస్ట్ విశ్లేషణ:
30 నుండి 52 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులు, ఉన్నత విద్యావంతులతో కూడిన ఈ ప్రభుత్వం ‘జెన్-జీ’ తరానికి ఆశాదీపంలా మారింది. డిజేలు, ర్యాపర్లు అని విమర్శించిన వారి నోళ్లు మూయిస్తూ.. టెక్నాలజీ, నైపుణ్యంతో నేపాల్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దక్షిణాసియా రాజకీయాల్లో ఇదొక గొప్ప మలుపు!
