ప్రకృతి అందాలతో అలరారే నేపాల్లోని హుమ్లా జిల్లాకు చెందిన ‘నియిన్బా’ తెగ ప్రజలలో నేటికీ కొనసాగుతున్న ఒక వింత వివాహ పద్ధతి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మహాభారతంలోని ద్రౌపదిని గుర్తుకు తెచ్చేలా, ఇక్కడ ఒకే కుటుంబంలోని అన్నదమ్ములందరూ కలిసి ఒకే మహిళను వివాహం చేసుకుంటారు. వినడానికి ఇది వింతగా అనిపించినప్పటికీ, ఈ ‘పాంచాలి’ పద్ధతి వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఎందుకు ఈ వింత పద్ధతి? సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడం, జీవనోపాధి పొందడం చాలా కష్టం. అన్నదమ్ములు ఎవరికి వారు విడిగా వివాహం చేసుకుంటే, కుటుంబ ఆస్తి ముక్కలై చిన్న చిన్న భూభాగాలుగా మారిపోతుంది. ఆస్తి ఇలా విడిపోకుండా ఉండటం కోసం, వారంతా ఒకే మహిళను వివాహం చేసుకునే పద్ధతిని పాటిస్తున్నారు.
నిజానికి 1963లోనే నేపాల్ ప్రభుత్వం ఈ పద్ధతిని నిషేధించినప్పటికీ, జీవనాధారం కోసం నేటికీ అనేక మారుమూల పర్వత గ్రామాల్లో ఈ ఆచారం రహస్యంగా కొనసాగుతోంది. విశేషమేమిటంటే, ఇక్కడ పుట్టే పిల్లలకు అన్నదమ్ములందరినీ తండ్రులుగానే పరిగణిస్తారు, దీనివల్ల కుటుంబంలో ఎలాంటి మనస్పర్థలు రావని వారు నమ్ముతారు.
