అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూ మెక్సికో రాష్ట్రం పేరును “న్యూ అమెరికా” (New America) గా మార్చడంపై సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆయన పోస్ట్ చేసిన చిత్రంలో, “New Mexico” అనే పేరులోని “Mexico” అనే పదాన్ని తొలగించి, దానికి బదులుగా “America” అని చూపించారు. దీంతో ఈ పోస్ట్ నిజంగానే పేరు మార్పు ప్రతిపాదన కోసమా లేక కేవలం రాజకీయ వ్యాఖ్య మాత్రమేనా అనే చర్చ మొదలైంది.
తన పోస్టులో ట్రంప్ ప్రస్తావిస్తూ… న్యూ మెక్సికో పేరును “న్యూ అమెరికా”గా మార్చాలని చాలామంది తనను కోరినట్లు పేర్కొన్నారు. గతంలో ఆయన ప్రతిపాదించిన పేరు మార్పు ప్రయత్నాలకు కొనసాగింపుగానే ఈ పరిణామాన్ని చూస్తున్నారు. గతంలో కూడా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ (Gulf of Mexico) పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ (Gulf of America) అని, ‘లేక్ అంటారియో’ (Lake Ontario) పేరును ‘లేక్ అమెరికా’ (Lake America) అని మార్చాలని ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, కేవలం అధ్యక్షుడి వ్యక్తిగత ఉత్తర్వుతో ఏ రాష్ట్రం చట్టబద్ధమైన పేరునూ మార్చడం సాధ్యం కాదు. న్యూ మెక్సికో పేరును మార్చాలంటే ఆ రాష్ట్ర స్థాయిలోనూ, అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) స్థాయిలోనూ అధికారికంగా చట్టబద్ధమైన ఆమోదం తప్పనిసరి. కాబట్టి ప్రస్తుతం “న్యూ అమెరికా” అనేది అధికారిక మార్పు ఏమీ కాదు; కేవలం ట్రంప్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే.
మరోవైపు, న్యూ మెక్సికో గవర్నర్ మిచెల్ లుజాన్ గ్రిషామ్ (Michelle Lujan Grisham) స్పందిస్తూ… రాష్ట్రం పేరుపై ఎలాంటి చర్చకు తావులేదని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. తమ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, గుర్తింపుతో “న్యూ మెక్సికో” అనే పేరు పెనవేసుకుపోయి ఉందని ఆమె స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ చేసిన ఈ పోస్ట్ అమెరికా రాజకీయాల్లోనే కాకుండా, న్యూ మెక్సికో ప్రజల్లో కూడా సరికొత్త వివాదానికి తెరలేపింది.
